విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని అభ్యర్థులపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం జిల్లాలో పాగా వెయ్యాలని చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చెయ్యాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. 

ఇటీవల చేయించిన సర్వే నివేదిక ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు చంద్రబాబు. ఓడిపోయే అవకాశం ఉన్నవారు ఎంతటి వారైనా చంద్రబాబు ఉపేక్షించడం లేదు. విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై రివ్యూ నిర్వహించిన చంద్రబాబు దాదాపు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణకే కేటాయించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ దక్షిణ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, గాజువాక అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పెందుర్తి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిలను ప్రకటించారు. 

వీరితోపాటు శృంగవరపు కోట అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, నర్సీపట్నం అభ్యర్థిగా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, యలమంచిలి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్‌బాబు, అనకాపల్లి అభ్యర్థిగా పీలా గోవింద్‌కు తిరిగి టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

మెుదటి దశలో తొమ్మిది మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ తొమ్మిది మంది అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం విశేషం. ఇకపోతే పాయకరావుపేట అభ్యర్థి ఎంపిక విషయంపై చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. 

ప్రస్తుత ఎమ్మెల్యే వంగలపూడి అనితపై అసమ్మతి పెద్ద వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వంగలపూడి అనితతోపాటు టీడీపీ కీలక నేత విజయ్ కుమార్, మాజీఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు చోడవరం నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో వేరే పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మాడుగుల అసెంబ్లీ విషయానికి వస్తే ప్రస్తుత టీడీపీ ఇన్ చార్జ్ రామానాయుడు గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి కూడా మాడుగుల నుంచి పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరితోపాటు పైడా ప్రసాదరావుపేరుకూడా పరిశీలనలో ఉంది. 

ఇకపోతే అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. అరకు అభ్యర్థిగా మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌, పాడేరు అభ్యర్థిగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎంపిక దాదాపు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది.  

ఇకపోతే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ఎంపిక ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఈనెల 17న కొణతాల రామకృష్ణ సైకిలెక్కనున్నారు. కొణతాల రామకృష్ణ కానిపక్షంలో విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

అయితే కొణతాల రామకృష్ణ అభ్యర్థిత్తవం దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం. కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్‌కి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే విజయ్ కి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. అయితే నర్సీపట్నం అభ్యర్థిగా తిరిగి అయ్యన్నపాత్రుడినే పోటీ చెయ్యాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.