ఓట్ల దొంగలు, ఈవీఎం దొంగలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన ఆదివారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్టీకి ఎక్కువ ఓట్లు తెచ్చినవారికే పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రూ. లక్ష కోట్ల ఆస్తులు లాక్కున్న కేసీఆర్‌తో జగన్ దోస్తి చేస్తున్నారని, పదేపదే పోలవరంపై కేసులు వేసే టీఆర్‌ఎస్‌కు జగన్ మద్దతు తెలుపుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

జగన్ ఆస్తుల కోసం రాష్ట్రాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారని, జగన్ ‘‘మోడీ భజన’’ బీజేపీ నేతలను మించిపోయిందని సీఎం ధ్వజమెత్తారు. వైసీపీ మైండ్ గేమ్‌లను, సైకో గేమ్‌లను చిత్తు చేయాలని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

లోటస్‌పాండ్ లాభాల కోసం ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని, కియాపై మోడీకి జగన్ కితాబిచ్చారన్నారు. కియా క్రెడిట్ తనదే అని చెప్పే సాహసం మోడీయే చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

ఏపీకి మోడీ నమ్మక ద్రోహం చేశారని, తెలంగాణలో ఏపీ ఆస్తులను కేసీఆర్ లాక్కున్నారన్నారు. సొంత లాభాల కోసమే మోడీ, కేసీఆర్‌లతో జగన్ దోస్తీ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  

ఆంధ్రులను అవమానించిన టీఆర్ఎస్ నేతలకు జగన్ మద్ధతుగా నిలుస్తున్నారని.. ఈ ఒక్కసారి ప్లీజ్ అంటే, క్రూరమృగం దగ్గరకు ఎవరైనా వెళ్తారా అంటూ దుయ్యబట్టారు. జగన్‌కు ఛాన్సిస్తే జనాన్ని బతకనిస్తారా అని సీఎం ప్రశ్నించారు.

తండ్రికి అవకాశం ఇస్తేనే, ఉమ్మడి రాష్ట్రాన్ని మింగేశారని, ఒక్కసారే కదా అని ఎవరైనా లోయలో దూకుతారా అంటూ మండిపడ్డారు.