రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే అధికారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గురువారం అర్థరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తనకందిన సమాచారం ప్రకారం 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

అర్థరాత్రి వరకు పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు సీఎం అభినందనలు తెలిపారు. కౌంటింగక వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని, స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఫలితాలు వెలువడే వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఓడిపోతున్నామనే ఫస్ట్రేషన్‌తో వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. అర్థరాత్రి 12 గంటలు అయినా ఇంకా 200 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ సాగిందన్నారు.

మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈ పరిస్థితి కల్పించారని.. ఓటింగ్ సజావుగా సాగడానికి కార్యకర్తలు, ప్రజలే కారణమని... ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా ప్రజలు తెలుగుదేశం వైపే నిలిచారని చంద్రబాబు స్పష్టం చేశారు.