అనంతపురం: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నేను 10 రిటర్న గిఫ్ట్‌లు ఇస్తా అంటూ హెచ్చరించారు. 

కేసీఆర్ పంపించే డబ్బులకు ఏపీలో ఓట్లు రావంటూ ధ్వజమెత్తారు. ఏం చేశాడని జగన్‌కు 22 ఎంపీ సీట్లు వస్తాయంటూ ప్రశ్నించారు చంద్రబాబు.  జగన్‌ను కేసీఆర్ పావుగా ఉపయోగించుకుని ఏపీకి దెబ్బకొట్టాలని చూస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు.

16 సీట్లు ఇస్తే చక్రం తిప్పుతానని అంటున్న కేసీఆర్ తెలంగాణను ఏమైనా అభివృద్ధి చేశావా అంటూ నిలదీశారు. తెలంగాణలో ఏమాత్రం అభివృద్ధి చేయని కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి ఎంతో చేసిన టీడీపీ ఎన్ని సీట్లు గెలవాలో మీరే నిర్ధారించాలని ప్రజలను అడిగారు. 

ఏపీలో టీడీపీ మళ్లీ గెలవడం చారిత్రక అవసరం అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏ అధికారంతో పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులేస్తున్నారని నిలదీశారు. జగన్, మోదీ, కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేదని విమర్శించారు. 

అభివృద్ధి సగంలో ఆగిపోవడానికి వీళ్లేదని, కుట్రలకు పాల్పడుతున్న వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు నీతి, నిజాయితీ లేదని, పద్ధతి తెలియదన్నారు. 

జగన్‌కు ఓటేస్తే అవినీతి పెరుగుతుందని, అభివృద్ధి ఆగిపోతుందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ ఎత్తున దోచుకున్నారని ఆరోపించారు. జగన్‌ వల్ల అనేక మంది అధికారులు జైలుపాలయ్యారని చంద్రబాబు గుర్తు చేశారు. 

ఏపీ ఎన్నికలతో తమకు సంబంధంలేదని కేటీఆర్‌ అంటున్నారని, మరి ఏపీకి డబ్బులు పంపడం అవసరమా? అంటూ నిలదీశారు. టీడీపీ డేటాను దింగిలించి వైసీసీకి ఇచ్చి తమ పార్టీని నిర్వీర్యం చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.