ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ముగిసిందని, ఎంతమంది బరిలో ఉన్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నామని సీఈవో తెలిపారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదన్నారు. ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేదని, బదిలీ చేసింది సీఈసీ అయితే తనకు లేఖ రాయడం వల్ల ప్రయోజనమేంటని ద్వివేది ప్రశ్నించారు.

సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చామని,  ఎన్నికల గుర్తును ఇప్పుడు మార్చడం కుదరదని స్పష్టం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు భద్రత పెంచాల్సిందిగా పోలీసులకు సూచించామని ద్వివేది తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఈవో వెల్లడించారు.