Asianet News TeluguAsianet News Telugu

వీవీప్యాట్‌లు, ఈవీఎంలు ఎలా లెక్కిస్తామంటే: ద్వివేది వివరణ

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఈ నెల 23న కౌంటింగ్‌పై అందరి చూపు పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కౌంటింగ్ వివరాలను మీడియాకు వెల్లడించారు

AP CEO dwivedi clarifies on counting
Author
Amaravathi, First Published May 20, 2019, 6:04 PM IST

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఈ నెల 23న కౌంటింగ్‌పై అందరి చూపు పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది కౌంటింగ్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు... ఫలితాల లెక్కింపులో వీవీప్యాట్‌ స్లిప్పులు ఫారం 17సీతో సరిపోవాలన్నారు. కంట్రోల్ యూనిట్‌లో మరమ్మత్తులు సాధ్యం కాకపోతే వీవీప్యాట్‌లను లెక్కిస్తామని ద్వివేది స్పష్టం చేశారు.

ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకా... సమస్య ఉన్న ఈవీఎం, వీవీప్యాట్లు లెక్కిస్తామని వివరించారు. లెక్కింపునకు ముందు మాక్ పోల్ రిపోర్ట్‌ కూడా లెక్కలతో సరిపోవాలని ద్వివేది తెలిపారు. సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగిస్తే పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లు తొలగిస్తారని తెలిపారు.

వీవీప్యాట్ స్లిప్పులు... ఈవీఎం ఓట్లతో సరిపోవాలని... రెండింటి లెక్కల్లో తేడా వస్తే రెండోసారి లెక్కింపు జరుపుతామని సీఈవో వెల్లడించారు. లెక్కింపులో సందేహాలు తలెత్తితే పోలింగ్ డైరీ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ద్వివేది తెలిపారు.

లెక్కింపులో సాంకేతిక సమస్యలు.. వివాదాలు తలెత్తిన ప్రాంతాల్లో ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొరాయించిన ఈవీఎంల లెక్కింపు, కౌంటింగ్ చివర్లో చేపట్టనున్నట్టు ద్వివేది స్పష్టం చేశారు.

లెక్కింపులో పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్వోదే తుది నిర్ణయని ఏపీ సీఈవో తెలిపారు. పార్టీల మధ్య తక్కువ తేడా వస్తే రీకౌంటింగ్‌కు ఆదేశించే అవకాశం ఉంటుందని... రీకౌంటింగ్ నిర్ణయాధికారం రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులదేనని ద్వివేది స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఒకేసారి ప్రారంభమవుతుందని, కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ద్వివేది వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios