అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల కమీషన్ కు మధ్య నెలకొన్న రాజకీయ వివాదం నేపథ్యంలో రాష్ట్ర అధికారులు చిక్కుల్లో పడ్డారు. వివాదానికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారు. 

కొంత మంది అధికారులు మే 23వ తేదీ వరకు దీర్షకాలిక సెలవుపై వెళ్తున్నారు. మే 23వ తేదీన ఓల్ల లెక్కింపు జరుగుతుందనే విషయ.ం తెలిసిందే. మరికొంత మంది అధికారులు డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

తమ దీర్షకాలిక సెలవుకు అధికారులు వ్యక్తిగత కారణాలను చూపుతున్నారు. ప్రభుత్వం కొంత మంది అధికారులకు సెలవులు మంజూరు చేసింది. వాణిజ్య పన్నుల చీఫ్ కమిషర్ జె శ్యామల రావుకు ప్రభుత్వం 33 రోజుల పాటు సెలవు మంజూరు చేసింది. ఆయన జూన్ 14వ తేదీన విధుల్లో చేరుతారు. అప్పటికి కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది. 

ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు 26 రోజుల సెలవు మంజూరైంది. మే 20వ తేదీన ఆయన విధుల్లో చేరుతారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో)లోని ఓ కార్యదర్శి కూడా సెలవుపై వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. 

ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం... ఐదుగురు ఐఎఎస్ అధికారులు, ఐదుగురు ఐపిఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్ మీద వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అధికారుల్లో ఒకరు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.