కృష్ణాజిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వల్లభనేని వంశీ విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో వంశీ 820 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్ అప్‌డేట్స్

45 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. ఎగ్జిట్ పోల్స్‌కు సైతం అందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలల్లో అంతిమ విజేత ఎవరో గురువారం తేలిపోనుంది. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
గన్నవరంలో వల్లభనేని వంశీ గెలుపు
15 ఓట్ల తేడాతో బొండాపై మల్లాది విష్ణు గెలుపు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్కంఠ నడుమ ఫలితం విడుదలైంది. టీడీపీ అభ్యర్ధి బొండా ఉమపై వైసీపీ అభ్యర్ధి మల్లాది విష్ణు 15 ఓట్ల తేడాతో గెలుపొందారు.
వైఎస్ జగన్‌కు వెంకయ్య నాయుడు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. జగన్‌కు ఫోన్ చేసిన ఆయన.. తెలుగు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని వెంకయ్య తెలిపారు.
జగన్ కు ప్రణబ్ శుభాకాంక్షలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. మీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపారమైన విశ్వాసాన్ని చూపారు.. ప్రజలు, రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్లాలని ఆశిస్తున్నా... వైఎస్ ఖచ్చితంగా గర్వపడే రోజు ఇది’’ అని ప్రణబ్ ట్వీట్ చేశారు.
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి
చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరాజయం పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి విడుదల రజనీ విజయం సాధించారు.
పరిటాల శ్రీరామ్ ఓటమి
అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు, శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘన విజయం సాధించారు.
మంత్రి దేవినేని ఉమా ఓటమి
కృష్ణాజిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమా ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి వసంత వెంకట కృష్ణప్రసాద్ 12,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ప్రజా తీర్పును శిరసావహిస్తాం: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారాలోకేశ్ స్పందించారు. ప్రధాని మోడీ, వైఎస్ జగన్‌లకు అభినందనలు తెలిపుతూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ ఎప్పుడూ ప్రజా పక్షమేనని లోకేశ్ స్పష్టం చేశారు.
అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టా: పవన్
అన్నింటికి సిద్ధపడే పార్టీ పెట్టానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల ఫలితాల అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన జనసైనికులకు, జనసేనకు ఓటు వేసిన ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.
బలమైన మెజారిటీ సాధించిన వైఎస్ జగన్, ప్రధాని నరేంద్రమోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస విడిచే వరకు రాజకీయాల్లో ఉంటానని పవన్ స్పష్టం చేశారు. ఏ ప్రత్యేక హోదా అయితే వస్తుందని అంతా భావించారో... ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని ఆయన అభ్యర్ధించారు.
జనసేన ఈ ఎన్నికల్లో కొత్తరకం రాజకీయాలు చేసిందని... ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదని పవన్ స్పష్టం చేశారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, రెండు స్ధానాల్లో ఓడినా.. మా వాళ్లు ఒక్క సీటు గెలవకపోయినా.. తుది శ్వాస వరకు ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని తెలిపారు.
నారా లోకేశ్ ఓటమి
గుంటూరు జిల్లా మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కడప, కర్నూలు, నెల్లూరులలో వైసీపీ క్లీన్ స్వీప్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలకు జిల్లాలే వైసీపీ ఖాతాలో వచ్చి పడ్డాయి. ముఖ్యంగా కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
స్పీకర్ కోడెల ఓటమి
సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబు విజయం సాధించారు.
మంత్రి నారాయణ ఓటమి
నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ ఓటమి పాలయ్యారు. ఆయనపై వైసీపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
జగన్‌కు చంద్రబాబు అభినందనలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోడీకి, ఒడిషా ఎన్నికల్లో గెలుపొందిన నవీన్ పట్నాయక్‌కు బాబు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఓటమి
ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. ఆమెపై వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రరెడ్డి విజయం సాధించారు.
సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా
ముఖ్యమంత్రి పదవికి నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపారు. అనంతరం బాబు రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగాలని చంద్రబాబును గవర్నర్ కోరారు.
గంటా గెలుపు గంట
విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్ధి, మంత్రి గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు.
హిందూపురంలో బాలకృష్ణ విజయం
అనంతపురం జిల్లా హిందూపురంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు.
ట్యాంపరింగ్ ఆరోపణ.. వినుకొండలో ఆగిన ఫలితం
గుంటూరు జిల్లా వినుకొండలో ఎన్నికల ఫలితం ప్రకటన ఆగిపోయింది. బొల్లాపల్లి మండలం గండిగనుమల తండా బూత్‌కి చెందిన ఈవీఎంలలో ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం రావడంతో టీడీపీ అభ్యర్ధి జీవీ ఆంజనేయులు ఆందోళనకు దిగారు.
మంగళగిరిలో విజయం దోబూచులాట
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఫలితం ఉత్కంఠగా మారింది. ఇంకా మరికొన్ని రౌండ్లు లెక్కించాల్సి వుండగా... వైసీపీ అభ్యర్ధి ఆర్కే ఆధిక్యం నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.