శింగనమల: నిత్యం వివాదాల్లో ఉండే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో తొడగొట్టారు. శింగనమల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జేసి దివాకర్ రరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

తొడగొట్టి చెప్తున్నానంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు రావాలంటూ చంద్రబాబునాయుడే మళ్లీ సీఎం కావాలని స్పష్టం చేశారు. పుట్లూరు, యల్లనూరు మండలాలకు నీరు అందిస్తానంటూ తొడగొట్టి మరీ హామీ ఇచ్చారు.  

తాను సమితి ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి పలుమార్లు తమ పొలాలకు వదలకుండా శింగనమల నియోజకవర్గానికే ఎక్కువ నీరు వదిలినట్లు తెలిపారు. ప్రతి మహిళ గుండెల మీద చేయివేసుకొని చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని సూచించారు. 

చంద్రబాబు సీఎం అయితేనే రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు. కొందరిని తాము అందలం ఎక్కించామని అయితే వారే ఇప్పుడు ఎదురుతిరుగుతున్నారంటూ విమర్శించారు. ప్రజల అండ ఉండగా తమను ఎవరూ ఏమీ చెయ్యలేరన్నారు. 

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి...రెడ్డి అంటూ గ్రామాల్లో ఊరేగుతున్నారు కానీ కులం అన్నం పెట్టదన్నారు. మంచితనంతోనే ఏ రెడ్డి అయినా గెలుస్తాడని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.