అమరావతి: నిత్యం వివాదాల్లో ఉండే అనంతపురం ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి మరో వివాదానికి కారణమయ్యారు. అమరావతిలోని ప్రజావేదిక సాక్షిగా టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలపై దురుసుగా ప్రవర్తించారు. వారిపై అరుస్తూ నానా హంగామా చేశారు. దీంతో వారు బోరున విలపించారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే శింగనమల ఎమ్మెల్యే యామిని బాల, ఆమె తల్లి ఎమ్మెల్సీ శమంతకమణిలు ప్రజావేదిక వద్దకు వచ్చారు. అక్కడే ఉన్న కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పలకరించేందుకు వెళ్లారు. 

అయితే అక్కడ ఉన్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక ఎమ్మెల్సీ శమంతకమణి బోరున విలపించారు. ఏడుస్తూ వెనక్కివెళ్లిపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆమె వద్దకు వెళ్లి సర్దిచెప్పారు. 

జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహానికి అసలు కారణం శింగనమల టికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేగా యామిని బాల ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో టికెట్ కోసం ఆమె గట్టిగానే పోరాడుతున్నారు. 

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ అడ్డుపడుతున్నారు. అంతేకాదు బండారు శ్రావణికి టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడుకు సిఫారుస చేశారు. అయితే శింగనమల నియోజకవర్గంలో కీలక నేతలైన ముంటిమడుగు కేశవ్‌రెడ్డి, ఆలం నర్సానాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు పలువురు నేతలు శ్రావణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

వీరంతా శ్రావణితో పోలిస్తే యామినీబాలకు టిక్కెట్‌ ఇవ్వడమే ఉత్తమమని అధిష్టానం వద్ద తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. టీడీపీ కేడర్‌ శమంతకమణితోనే ఉందని, శ్రావణికి సహకరించరని తేల్చిచెప్పారు. 

అయితే జేసీ దివాకర్ రెడ్డి మాత్రం యామినీకి కాకుండా తాను సిఫార్సు చేసిన శ్రావణికే టిక్కెట్‌ ఇవ్వాలని చంద్రబాబును పట్టుబడుతున్నారు. ఈ వ్యవవహారంపైనే ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.