తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలో వస్తుందని ఈ విషయంలో ఎంత పందెం కాయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ.

స్థానిక గవరపాలెం కొణతాల సుబ్రమణ్యం హాల్‌లో జరిగిన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జెండాతో అధికారం అనుభవించి , అభివృద్ధి చెంది ఇప్పుడు ఆ పార్టీని విమర్శించడం తగదన్నారు.

వైసీపీ నేతలు ఎక్కువ ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారని... తాను ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా అనకాపల్లి నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరుగా నిలిచిందని, వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం మంచిది కాదన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తల్లి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన తండ్రి వద్దకు వచ్చి అభ్యర్థించిన రోజులు గుర్తుకు తెచ్చుకోవాలని గోవింద వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా వారి కుల పెద్దలకు వెళ్లి తన కొడుకు అప్పుల పాలైపోయాడని, ఒక అవకాశమివ్వాలని కోరారన్నారు.

అప్పుల పాలైతే ఎన్నికల్లో గెలిచి పోయిన సొమ్మంతా సంపాదిస్తారా..? సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తారా అని పీలా ప్రశ్నించారు. ఎంత ఎదిగినా ఒదిగి వుండాలన్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మహిళల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ... అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు దిగారన్నారు. ఏకంగా స్పీకర్‌ను సైతం కొట్టడం వారి గుండాయిజానికి పరాకాష్ట అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా మహిళలు తమ వైపే ఉన్నారన్నారు.