విజయవాడ: ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తోంది. నేతల విమర్శలు ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం పొగలు సెగలు కక్కుతోంది. అటు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు రాష్ట్రమంతా జల్లెడ పట్టేస్తున్నారు. 

రోజుకు మూడు నుంచి 5 సభలలో పాల్గొంటూ పొలిటికల్ హీట్ పెంచారు. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో సినీనటులు తళుకు మంటున్నారు. తారల ప్రచారంతో ఎన్నికల  ప్రచారానికి సరికొత్త సందడి నెలకొంది. 

సినీనటులు పవన్ కళ్యాణ్, నాగబాబు, రోజా, మురళీమోహన్, అలీ, తనీష్, బాలకృష్ణ, రమ్యశ్రీ, హైపర్ ఆదిలు తమదైన శైలితో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. సినీ పంచ్ డైలాగులతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. 

హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తన నటనతో సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బ్టస్టర్ అందుకున్న పవన్ కళ్యాణ్ తన పంచ్ డైలాగులతో ఓట్లను కొల్లగొట్టే పనిలో పడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యని పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. 

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పిలిచే ఆర్కే రోజా తనదైన పంచ్ లతో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. 

అటు మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన తరపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. 

నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే భీమవరం నియోజకవర్గాన్ని దాదాపుగా చుట్టేశారు. తన డైలాగులతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు నాగబాబు. 

ఇకపోతే హాస్యనటుడు అలీ సైతం తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కర్నూలు జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు అలీ. కర్నూలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ ఖాన్, పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

పంచ్ డైలాగులు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అలాగే నంద్యాల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు అలీ. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ లోని బనగానపల్లె నియోజకవర్గంలో అలీ విస్తృతంగా పర్యటించారు. 

నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి నంద్యాలను చుట్టేశారు అలీ. అంతకుముందు తన సొంత జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో పర్యటించారు. రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  

యంగ్ హీరో తనీష్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ దుమ్ము రేపుతున్నారు. నచ్చావులే అంటూ తెలుగుప్రేక్షకులకు దగ్గరైన  తనీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తనీష్ అలీతోకలిసి కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

ఇకపోతే మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మురళీమోహన్ కోడలు మాగంటి రూపాదేవి తరపున విస్తృతంగా పర్యటిస్తున్నారు మురళీమోహన్. 

అటు నందమూరి బాలకృష్ణ సైతం ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్న బాలకృష్ణ రెండురోజుల క్రితం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన నియోజకవర్గలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మహిళలతో కలిసి స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

మరో సినీనటి రమ్యశ్రీ సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రమ్యశ్రీ విశాఖ జిల్లా అరకు వైసీపీ అభ్యర్థి శెట్టి ఫాల్గుణ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 

చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ ఆశయసాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్ తోనే సాధ్యమంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే జబర్దస్త్ ఫేం, సినీనటుడు హైపర్ ఆది సైతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం కలిగిన హైపర్ ఆది ఇప్పటికే జనసేన తరపున విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెనాలి నియోజకవర్గంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. 

జబర్దస్త్ వేదికపై జోకులు వేస్తూ నవ్వించే హైపర్ ఆది అదే జోకులు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. సినీడైలాగులకు రాజకీయాలు జోడిస్తూ పంచ్ లు వేస్తూ జనసేనకు ఓటెయ్యాలని కోరుతున్నారు హైపర్ ఆది. 

మెుత్తానికి ఏపీ ఎన్నికల ప్రచారంలో తారల తళుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే సినీనటుల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విపరీతంగా ఆదరణ లభిస్తోంది. తమ అభిమాన నటులు తమ దగ్గరకే వస్తుండటంతో వారిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.