విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, సినీనటి రమ్యశ్రీ. తప్పుడు హమీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా అరకు వైసీపీ అభ్యర్థి శెట్టి ఫాల్గుణ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 

చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ ఆశయసాధనకు అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం పట్ల ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఏపీకి ప్రత్యేకహోదా రాలేదన్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్ ప్రతీ ఒక్కరి సమస్య తెలుసుకున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిస్కరించేందుకే నవరత్నాలను ప్రకటించారని స్పష్టం చేశారు. 

ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యాలని కోరారు.  ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు పాలనలో గిరిజన ప్రాంతాలు అన్నిరంగాల్లో వెనుకుబాటుకు గురయ్యాయని విమర్శించారు. 

గిరిజన ప్రాంతాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. అరకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నేత సినీనటి రమ్య శ్రీ కోరారు.