ప్రముఖ సినీ నటుడు అలీ.. సడెన్ గా ప్లేట్ తిప్పేశారు. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో నటుడు అలీ భేటీ అయ్యారు. 

సుమారు పావుగంట సేపు మాట్లాడిన అనంతరం అలీ వైసీపీ  కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి వైఎస్ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. కాగా.. టికెట్‌పై జగన్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.

నిన్నటి వరకు ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. గతంలో వరసగా జగన్, చంద్రబాబు, పవన్ లతో భేటీ అయ్యారు. తాజాగా.. వైసీపీలో బెర్తు ఖరారు చేసుకున్నారు. వైసీపీ తరఫున అలీ.. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కాగా పోటీ ఎక్కడ్నుంచి అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.