అమరావతి: ఏపీలో చర్చనీయాంశంగా మారిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. 

ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం కన్నా రాజకీయ వ్యవహారాల్లోనే ఎక్కువ దృష్టిపెట్టేవారని ఆరోపించారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి కీలక పాత్ర పోషించింది ఏబీ వెంకటేశ్వరరావేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 

అమరావతిలో ఆయన ఒక ప్రత్యామ్నాయ శక్తి మారారని ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం, లోపాయికారి ఒప్పందాలు చెయ్యడంలో చంద్రబాబు నాయుడు కంటే సిద్ధహస్తుడంటూ విరుచకుపడ్డారు. 

మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు అంటూ వ్యాఖ్యానించారు. 

ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని ఆరోపించారు. వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు. 

పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుద్దామనుకోవడం ఓటమితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి డబ్బు పట్టుకెళ్తూ అడ్డంగా దొరికిపోయినా ఆయన సిఫారసుతో వాటిని విడిపించుకున్నారని ఆరోపించారు. 

ఏబీ వెంకటేశ్వర రావు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని అందుకే ఈసీ వేటేసిందని  ఆరోపించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే డీజీపీని తప్పించాల్సిందేనని బొత్స వ్యాఖ్యానించారు. 

మరోవైపు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సైతం ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్‌ ఎవరికి ఇవ్వాలి, పార్టీలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలని నిర్ణయించేది వెంకటేశ్వరరావేనని ఆరోపించారు. 

అధికారులను టీడీపీ ఏవిధంగా మభ్యపెడుతుందో అందరికీ తెలుసునని అన్నారు. మరోవైపు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పైకి బుద్ధి మంతుడిలా చంద్రబాబు ప్రవర్తించడం సిగ్గుచేటని నేతలు విమర్శించారు. 

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.   వెంకటేశ్వరావును ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.