తణుకు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోహన్ బాబుకు ఆసక్తికర సంఘటన ఎదురైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఒకరైతు జగన్ సీఎం 120 సీట్లతో జగన్ సీఎం అవుతారంటూ హల్ చల్ చేశారు. దాంతో మోహన్ బాబు ఆ రైతును ప్రచారం రథంపైకి పిలిపించారు. ఆ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. 

జగన్ సీఎం అవుతారని స్పష్టం చేశాడు. జగన్ సీఎం అవుతారని తాను పందెం కాస్తున్నట్లు ప్రకటించారు. తనకు నాలుగు గేదెలు ఉన్నాయని వాటిని పందెం కాస్తున్నట్లు మోహన్ బాబు సమక్షంలోనే పందెం కాశారు. తనతో పందెం కాయమని ఎవరిని అడిగినా ముందుకు రావడం లేదన్నారు. 

గతంలో తాను తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వ్యక్తినని ఆ రైతు చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి మారిపోయిందని తొమ్మిదేళ్లుగా ప్రజల కోసం కష్టపడుతున్న జగన్ ను సీఎం చెయ్యాలని ఆ రైతు కోరడం విశేషం. 

రైతు మాటలకు మురిసిపోయిన మోహన్ బాబు జగన్ సీఎం అయిన తర్వాత తానే స్వయంగా తీసుకెళ్లి ఘనంగా జగన్ చేత సన్మానం చేయిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ గెలుస్తారని ఒకరైతు నమ్మకంతో ఉన్నారని అంటే రైతులు జగన్ పక్షాన ఉన్నారనడానికి నిదర్శనం ఇదేనన్నారు. 

వైఎస్ జగన్ సీఎం అయితే రైతు రాజు అవుతాడంటూ మోహన్ బాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును నమ్మెుద్దని మోహన్ బాబు హితవు పలికారు. చంద్రబాబు దొంగ దొంగ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని జగన్ కు ఓటేస్తే బంగారం అవుతందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.