గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీకి దిగాలని ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి సవాల్‌ విసిరారు.  ఆమె మంగళగిరి శాసనసభ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ వేశారు.

రాష్ట్రంలో మొట్ట మొదటి ట్రాన్స్‌జెండర్‌గా ప్రజా సేవకు ముందుకు వస్తున్నానని, ఈ ఎన్నికల్లో తనకు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని నామినేషన్ వేసిన తర్వాత తమన్నా మీడియాతో అన్నారు. 

జనసేన పార్టీకి నేను దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదని తమన్నా అన్నారు. నారా లోకేష్ బాబుకు మంగళగిరిలో ఓటమి తప్పదని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని తమన్నా వ్యాఖ‍్యానించారు. 

తమకు ఏ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని తమన్నా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.