ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)  సంచలన కామెంట్స్ చేశారు. లోకేష్ ని చంద్రబాబు మంగళగిరి నుంచి ఎందుకు పోటీకి దింపుతున్నారో కూడా ఆర్కే వివరించారు. 

ఈరోజు ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. నిజానికి పోటీ చేయాల్సింది లోకేష్ కాదు.. చంద్రబాబు. కానీ నా చేతిలో ఓడిపోతానని భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. ఇక లోకేష్ ని  చంద్రబాబు భరించలేకపోతున్నారు. అందుకే మంగళగిరిలో పోటీ చేయించి... నా చేతిలో ఓడగొడితే.. దరిద్రం పోతదని అనుకున్నాడు. శాశ్వతంగా లోకేష్ బాధలు తొలుగుతాయని మంగళగిరి నుంచి లోకేష్ ని దింపుతున్నారు’’ అని అన్నారు.

‘‘మంగళగిరి నుంచి పోటీ చేయడం తన పూర్వజన్మ సుకృతం అని లోకేష్ అంటున్నాడు. పూర్వజన్మ సుకృతం అర్థం తెలుసుకోని లోకేష్ మాట్లాడితే బాగుంటది. వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే నాయకుడు, ఒక మనిషి రాజకీయంగా హత్య గావించబడితే.. పరవశించి పోతున్నాను అని చెప్పే వ్యక్తి మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు వస్తున్నాడు. మంగళగిరిలో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరగబోతోందని’’ ఆర్కే స్పష్టం చేశారు. 

పేదలను, రైతులను బాబు మోసం చేస్తున్నారని, ఆయన అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.