లోకసభకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడుతలుగా జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11వ తేదీన ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో లోకసభకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో లోకసభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.

తిప్పి తిప్పికొడితే ఎన్నికలకు నెల రోజుల వ్యవధి కూడా లేదు. తొలి విడత పోలింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఒక రకంగా సర్దుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీకే కాకుండా వైఎస్సార్ కాంగ్రెసుకు కూడా అదే పరిస్థితి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు.

అయితే, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కళా వెంకట రావు చేసిన వ్యాఖ్యలను చూస్తే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు భయపడుతున్నారా అనే సందేహం కలగడం సహజం. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేని భయం చంద్రబాబుకు ఎందుకనేది సమంజసమైన ప్రశ్నే. అయితే, జగన్ బయటపడలేదు గానీ చంద్రబాబు భయం మాత్రం కళా వెంకటరావు వ్యాఖ్యల ద్వారా బయటపడిందని అనుకోవచ్చు. 

కేసీఆర్ జగన్ కు అనుకూలంగా వ్యవహారాలు నడుపుతున్నారని, జగన్ కోసం వ్యూహరచన అంతా కేసీఆర్ చేస్తున్నారని చంద్రబాబు అంటూ వస్తున్నారు. అంటే, ఎన్నికల తేదీలను ఖరారు చేయించడంలో కేసీఆర్ పాత్ర ఉందని కళా వెంకట్రావు అనడాన్ని బట్టి తొలి విడత పోలింగ్ జగన్ కు అనుకూలంగా పనిచేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయమే.

బిజెపి ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎన్నికల కమిషన్ ను ప్రభావితం చేసి వ్యవధి చిక్కకుండా ఎన్నికల తేదీలను ఖరారు చేయించారని కళా వెంకటరావు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రేసు గుర్రంలా, ఉసేన్ బోల్ట్ మాదిరిగా ఎన్నికల్లో పరుగెత్తాల్సిన పరిస్థితి కల్పించారని అన్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ఎన్నికల గుబులు అలుముకుందని భావించవచ్చు.

నిజానికి, చంద్రబాబు చాలా కాలం క్రితమే ఎన్నికలను ఎదుర్కోవడానికి కసరత్తు చేస్తూ వస్తున్నారు. ఆయన నిర్వహించిన బహిరంగ సభలు కూడా ఎన్నికల సభలనే తలపించాయి. అయితే, వైఎస్ జగన్ మాత్రం పాదయాత్ర తర్వాత కూడా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ వస్తున్నారు. ఈ రకంగా ప్రచారంలో జగన్ ముందున్నారని భావించవచ్చు. 

తొలి విడత ఎన్నికల వల్ల తమకు తగిన సమయం చిక్కడం లేదనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో నెలకొన్నట్లు కళా వెంకటరావు మాటల్లో వ్యక్తమైంది. చంద్రబాబు ఆ విధమైన ఆందోళననే వ్యక్తం చేయకపోతే కళా వెంకట రావు ఆ మాటలు అనే అవకాశం లేదు. పైగా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు రాసిన బహిరంగ లేఖలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు ప్రమేయం లేకుండా కళా వెంకటరావు కేసీఆర్ కు ఆ బహిరంగ లేఖ రాస్తారని కూడా అనుకోవడానికి లేదు. చంద్రబాబు నుంచి సంకేతాలు అందకుండా అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎదురయ్యే పరిణామాలేమిటో కళా వెంకటరావుకు తెలియనిది కాదు. దీన్నిబట్టి చూస్తే, తెలుగుదేశం పార్టీలో గుబులు రేగుతోందని మాత్రం అనుకోక తప్పదు.

- కె. రవికిరణ్