అమరావతి: ప్రజా శాంతి అధినేత కెఎ పాల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బోలెడంత హాస్యాన్ని పండిస్తున్నారనే చాలా మంది అనుకుంటున్నారు. ఆయన చేష్టలు, మాటలు ఎడతెగని హాస్యాన్ని కురిపిస్తున్నాయి. ఆయన వీడియోలు వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసినవారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

కానీ, పాల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని క్రమంగా తెలిసివచ్చింది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు తెలిసి వచ్చింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు గానీ పుణ్యకాలం కాస్తా దాటిపోయిందా అనే అనిపిస్తోంది. 

పాల్ వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు పాల్ వెనక ఉన్నారా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఆయన టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. 

పార్టీ జెండా నుంచి మొదలు పెడితే అభ్యర్థుల ఎంపిక దాకా ప్రతి అంశంలోనూ ఆయనకు వైఎస్ జగన్ పై ఉన్న కసి వ్యక్తమవుతోంది. దాదాపు 35 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు, రెండు లోకసభ అభ్యర్థుల పేర్లు దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్నాయి. చదువు వచ్చిన ఓటర్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన తర్వాత అయోమయానికి గురి చేసే ప్రమాదం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ప్రజాశాంతి పార్టీ కండువా కూడా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాను పోలి ఉంది. అదే సమయంలో ప్రజాశాంతికి కేటాయించిన హెలికాప్టర్ గుర్తు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఎెసరు పెట్టే పరిస్థితి ఉంది. హెలికాప్టర్ పై ఫ్యాన్ ప్రధానంగా కనిపించి, వైఎస్సార్ కాంగ్రెసు ఫ్యాన్ గుర్తును పోలి ఉంది. ఇది ఎన్నికల్లో నిరక్షరాస్యులైన ఓటర్లను గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది. 

అయితే, కెఎ పాల్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అంత వ్యతిరేకత, కసి ఉండడానికి కారణాలు లేకపోలేదు. కెఎ పాల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తే. కానీ క్రమంగా ఆయన ప్రభలు తగ్గుతూ వచ్చాయి. దానికి ప్రధాన కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు. తన హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తనను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడనేది కెఎ పాల్ ప్రధాన అభియోగం. 

సోదరుడి హత్య కేసులో కెఎ పాల్ తీవ్రమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ కోసం తనను అణచివేస్తూ వచ్చారనేది కెఎ పాల్ ఆరోపణల్లో ఒక్కటి. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ ఎన్నికల్లో పాల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. 

ఎన్నికల గుర్తు, వైసిపి అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులతో నామినేషన్లు వేయించడం ఓ ఎత్తు అయితే, తన సామాజిక వర్గంలో పాల్ కు ఇప్పటికీ ఆదరణ ఉంది. వైసిపికి అనుకూలంగా ఉన్న ఆ ఓటర్లను తనకు అనుకూలంగా మలుచుకుని జగన్ ను దెబ్బ తీయాలనే ఎత్తుగడ కూడా పాల్ రాజకీయాల్లో ఉందని అంటున్నారు. 

పాల్ కు ఉన్న ఆదరణ ఏమిటో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్ బుక్కులో కొంత మంది పెడుతున్న పోస్టులనే తెలియజేస్తున్నాయి. అంటే, ఏదో మేరకు జగన్మోహన్ రెడ్డికి ఈ రూపంలో కూడా ఆయన నష్టం చేయడానికి పూనుకున్నారని అంటున్నారు. కెఎ పాల్ రూపంలో ఎదురైన గండాన్ని జగన్మోహన్ రెడ్డి దాటుతారా, లేదా అనే ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్న.