Asianet News TeluguAsianet News Telugu

ఎపి ఎన్నికలు: చంద్రబాబు వర్సెస్ కేసీఆర్, జగన్ సైడ్ లైన్

రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఆయన చంద్రబాబు వర్సెస్ కేసిఆర్ గా మార్చదలుచుకున్నట్లే కనిపిస్తున్నారు. ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు ఉద్దేశంతో బయటపడింది.

Andhra Pradesh elections became Chandrababu vs KCR
Author
Amaravathi, First Published Mar 11, 2019, 4:12 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాస్తా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వర్సెస్ చంద్రబాబుగా మారిపోయాయి. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్న మద్దతును చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సెంటిమెంటును రాజేయడానికి వాడుకుంటున్నారు. 

రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఆయన చంద్రబాబు వర్సెస్ కేసిఆర్ గా మార్చదలుచుకున్నట్లే కనిపిస్తున్నారు. ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు ఉద్దేశంతో బయటపడింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడంతో ప్రారంభమైన ఆ సెంటిమెంట్ యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. 

తెలంగాణ శానససభ ఎన్నికలను కాంగ్రెసును పక్కకు నెట్టేసి తనకూ చంద్రబాబుకు మధ్య జరుగుతున్న సమరంగా మార్చినట్లే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను చంద్రబాబు తనకూ కేసీఆర్ కు మధ్య జరుగుతున్న యుద్ధంగా మార్చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉపయోగపడుతుందనేది చెప్పలేం గానీ చంద్రబాబు మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. 

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్ అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఓటుకు నోటు కేసును తిరిగి తోడడం దగ్గరి నుంచి ఇటీవలి డేటా చోరీ వ్యవహారం దాకా చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడలు తెలిసి వస్తూనే ఉన్నాయి. ఆ రకంగా చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

ఎపి రాజకీయాలు పూర్తి స్థాయిలో వేడెక్కాయి. ఈ స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, జనసేన పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ కు ఇచ్చినట్లే చంద్రబాబుకు గెలుస్తామా, ఓడుతామా అనే సందేహాన్ని కలిగించే వాతావరణం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నట్లు సోషల్ మీడియాలోనూ కొంత మేరకు మీడియాలోనూ కనిపిస్తోంది. అయితే, క్షేత్ర స్థాయిలో ఆ వ్యతిరేకత ఉందా అనేది ప్రశ్నార్థకం. తెలంగాణలో కేసీఆర్ చేసినట్లుగానే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. అయితే, గత ఎన్నికలను బట్టి చూస్తే ఇరు పార్టీల మధ్య ప్లస్, మైనస్ ఒకటి రెండు శాతం ఓట్లు మాత్రమే. 

తెలుగుదేశం పార్టీ చాలా మంది స్థానిక శాసనసభ్యుల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. స్థానిక సమస్యల కారణంగా, ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల స్థానికంగా ఈ వ్యతిరేకత ఉంది. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండింది. అయితే, దాన్ని అధిగమించి కేసీఆర్ తన నాయకత్వం ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఘన విజయం సాధించారు. అదే రీతిలో చంద్రబాబు ఈ ఎన్నికల్లో బయటపడుతారా అనేది పరిశీలించాల్సిన విషయమే. 

మరో వైపు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇంతగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధిలో కూడా దూసుకుపోతున్నట్లు ఆయన చెబుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వస్తే అవి ఆగిపోతాయని కూడా చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు పనులు చేస్తున్నారు కదా అనే అభిప్రాయం ప్రజల్లో లేకపోలేదు. 

ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పెరగకుండా పసుపు- కుంకుమ, రైతు బంధు, డ్వాక్రా మహిళల పింఛన్ల పెంపు, నిరుద్యోగభృతి వంటి పలు సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన చూపిస్తున్నారు. 

మరో ముఖ్యమైన విషయం... వైసిపి గెలిస్తే రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. ఇందుకు జగన్ ప్రత్యేకంగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఆయన మేనిఫెస్టోలో పెడుతున్నారు. 

కేంద్ర సాయం కావాలి కాబట్టే, కేంద్రం సహాయం చేస్తుందనే తాను గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నానని చంద్రబాబు చెబుతూ ప్రధాని తన మాటను నిలబెట్టుకోకపోవడం వల్లనే బిజెపితో తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. పైగా, రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపితో జగన్ అంటకాగుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటుందనేది చూడాలి. 

కాంగ్రెసుతో దోస్తీ కట్టడానికి అవసరమైన హేతుబద్ధతను చంద్రబాబు చూపిస్తున్నారు. బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదని, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెసు చెబుతుందని, అందువల్ల బిజెపి కన్నా కాంగ్రెసు నయమని ఆయన చెబుతున్నారు. ఆ రకంగా తాను కాంగ్రెసుతో దోస్తీ కట్టడానికి సరైన కారణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందున అది తమకు కలిసి వస్తుందని వైఎస్ జగన్ అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో తేడా కేవలం 2 శాతం ఓట్లే కాబట్టి వాటిని రాబట్టుకోవడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నారు. 

పైగా, గత ఎన్నికల్లో మోడీకి ఉన్న చరిష్మా, పవన్ కల్యాణ్ మద్దతు టీడీపి విజయానికి పనిచేశాయని జగన్ అనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో బిజెపి ఓట్లు బిజెపికి, పవన్ కల్యాణ్ ఓట్లు జనసేనకు పడితే తమ పార్టీ విజయం నల్లేరు మీది నడక అవుతుందని భావిస్తున్నారు. 

దానికి తోడు, చంద్రబాబు అభివృద్ధిని అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. దానివల్ల ఇటు రాయలసీమలోనూ అటు ఉత్తరాంధ్రలోనూ చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అది తనకు అనుకూలంగా పనిచేస్తుందని జగన్ భావిస్తున్నారు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబుపై వ్యతిరేకత పెరుగుతుందని ఆయన అనుకుంటున్నారు. 

కులసమీకరణల విషయంలో చంద్రబాబును జగన్ చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నించారు. తన సామాజికవర్గానికి చెందినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన పోలీసు శాఖలో ప్రమోషన్లను ఎత్తిచూపారు. ఆ రకంగా మిగతా సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికితోడు క్షేత్ర స్థాయిలో జన్మభూమి కమిటీల్లోనూ అదే పరిస్థితి ఉందని ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

జనసేన రాష్ట్రంలో ఎంతగా బలపడితే తనకు అంత ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు వల్ల ఓ సామాజిక వర్గం ఓట్లు టీడీపికి పడి ఆ పార్టీ విజయం సాధించింది. పవన్ కల్యాణ్ పార్టీ బలపడితే ఆ సామాజికవర్గం టీడీపి ఓట్లనే చీలుస్తుందని భావిస్తున్నారు. 

ప్రభుత్వ వ్యతిరేకతను, టీడీపి ఓటు షేర్ ను పొందడానికి తనకే ఎక్కువ అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ జనసేన అంతగా బలపడలేదు కాబట్టి చంద్రబాబుకు ప్రత్యర్థిగా తననే చూస్తారని, టీడీపిని ఓడించే సత్తా వైసిపికి మాత్రమే ఉందని, జనసేనకు లేదని భావిస్తారని, అది తనకు ఉపయోపడుతుందని జగన్ అనుకుంటున్నారు. 

అయితే, కాపులకు ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడం ద్వారా కాపు సామాజిక వర్గం జారిపోకుండా చూసుకుంటున్నాడని చెప్పవచ్చు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ ఎలా చెప్పాడో కాపులకు చంద్రబాబు అదే రీతిలో చెబుతున్నారని భావించాల్సి ఉంటుంది. 

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి దిగితే జగన్ కు వ్యతిరేకంగానే పనిచేసే అవకాశాలు లేకపోలేదని అనుకుంటున్నారు. కేసీఆర్ పట్ల ఆంధ్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తన వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. తద్వారా జగన్ కు ప్రజలను దూరం చేసే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నారు. 

చంద్రబాబు విజయం సాధించడానికి తనకు అంది వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోరు. ఏదో ఒకటి చేసి గెలుస్తాడనే అభిప్రాయం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చెప్పడం తొందరపాటే అవుతుంది.

- శ్రీహర్ష గోపగాని

Follow Us:
Download App:
  • android
  • ios