తణుకు: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు నిప్పులు చెరిగారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి మోహన్‌ బాబు రోడ్‌షో నిర్వహించారు. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 

టీడీపీ చంద్రబాబుది కాదని మహానటుడు అన్నఎన్టీఆర్‌దని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయమని స్పష్టం చేశారు. అన్న ఎన్టీఆర్ శాపం ఫలిస్తుందన్నారు. 

ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకి డ్వాక్రా మహిళలు గుర్తొస్తారు తప్ప మిగిలిన సమయాల్లో గుర్తుకు రారని విమర్శించారు. పసుపు కుంకుమ పేరుతో వాళ్ల డబ్బులు వాళ్లకే ఇస్తున్నాడన్నారు. 

ఇన్నాళ్లు చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ఇసుక, మట్టి దోచుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఈసారి మళ్లీ అధికారం ఇస్తే ప్రజల  రక్తాన్నే పీల్చేస్తారని విమర్శించారు. సరిగ్గా మాట్లాడటం రాని తన కొడుక్కి మూడు మంత్రి పదవులు కట్టబెట్టటం సమంజసమా అని  చంద్రబాబును నిలదీశారు. 

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని మోహన్ బాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 130  స్థానాల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. వైఎస్‌ జగన్‌ కేసులు గురించి మాట్లాడే బాబు తనపై ఉన్న 11 కేసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఓటుకు  నోటు  కేసులో  అడ్డంగా  దొరికిపోయి  హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే  పారిపోయి  వచ్చింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని నాలుకలతో  మాట్లాడుతున్నాడో  ప్రజలు గమనించాలని కోరారు. 

పోలవరం నిధుల గురించి కేంద్రం లెక్కలు  అడిగితే చెప్పటం లేదని అదేమైనా బాబు తన అబ్బ మొగుడి  సొమ్ము అనుకొంటున్నాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని  వేరే దేశంలో అయితే ఉరి  తీసేవారన్నారు మోహన్ బాబు.