ఒంగోలు: తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టారని, అందుకే తాను బయటకు రావాల్సి వచ్చిందని వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ అన్నారు. జగన్ కోసం తాను ఇవాళ గడప దాటాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసునని ఆమె అన్నారు. 

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె శనివారం పాల్గొన్నారు. ఓట్లు అడగడానికి జగన్ అమ్మ వస్తోంది, చెల్లె వస్తోందని టీడీపి నాయకులు వెటకారంగా మాట్లాడుతున్నారని, మీ కోసం కష్టపడుతున్న జగన్ ను ఆశీర్వదించాలని అడిగేందుకు వచ్చానని ఆమె అన్నారు. 

వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని, 25 మంది ఎంపీలను గెలిపించి ప్రత్యేక హోదా సాధిచేలా జగన్ ను ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను కోరారు. వెలిగొండ ప్రాజెక్టును కావాలనే చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని, జిల్లాకు 16 సార్లు వచ్చిన చంద్రబాబు ఏం ఒరగబెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఇదే విషయం చెప్పాలని తనను ఇక్కడికి పంపించారని ఆమె అన్నారు. 

మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు అంటున్నారని, ఇన్నాళ్లూ ఏం బాధ్యత నెరవేర్చారని ఆమె అన్నారు. ఇవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆమె అన్నారు. చంద్రబాబు విలువలు లేని వ్యక్తి అని, చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని, చంద్రబాబు విశ్వసనీయత లేదని అన్నారు.