ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ మహిళానేత వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం బస్టాండ్ వద్ద జరిగిన సభలో షర్మిల సోమవారం పాల్గొన్నారు.

అవినీతి, అక్రమాలకు, వెన్నుపోటుకు చంద్రబాబు మారు పేరని షర్మిల ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె ఎద్దేవా చేశారు.

అమరావతిలో ఒక్క పర్మినెంట్ భవనం భవనం కూడా నిర్మించలేదని, అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఎలా ఇస్తారని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు చెబుతోందని..  మరి చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు.

జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారు. రైతులకు ప్రతి మే లో రూ.12,500 ఇవ్వడంతో పాటు పెన్షన్ పెంచుతారని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారని... పిల్లలను బడికి పంపిన తల్లికి ఏడాదికి రూ.15,000 అందిస్తారని.. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తారని షర్మిల తెలిపారు.

షర్మిల వెంట రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల వీర్రాజు, ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌ వున్నారు.