సంతనూతలపాడు: అమరావతిలో రాజధాని  నిర్మించే పేరుతో 40 దేవాలయాలను చంద్రబాబునాయుడు కూల్చివేశారని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. అమరావతి పేరుతో అమరేశ్వరస్వామి భూములు కొల్లగొట్టారన్నారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో సినిమా చూపిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ నియోజకవర్గంలో సాగునీరుకే కాకుండా తాగునీరుకు ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని వైఎస్‌ రాజశేఖరరెడ్డి రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను తెచ్చారని ఆయన గుర్తు చేశారు. 
 
వెలిగొండ ప్రాజెక్టు కింద పంట కాల్వలు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రైతులు పండించిన పంటలకు  సరైన గిట్టుబాటు ధరలు కూడ లేవన్నారు. 

చీమకుర్తిలో క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు మూతపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.