కర్నూల్:  చంద్రబాబుతో పాటు ఓ వర్గం మీడియాతో కూడ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.సోమవారం నాడు కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు.

 చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తో అన్నింటితో పోరాటం చేస్తున్నాం. వీళ్లంతా 20 రోజుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. మీ అందర్ని కోరేది ఒక్కటే. చంద్రబాబు అన్యాయాలు ఇంతటితో ఆగిపోవని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబునాయుడు డబ్బులను విచ్చలవిడిగా వెదజల్లే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులను చూసి మోసపోకూడదని ఆయన కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తోందన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే బడికి పిల్లల్ని పంపిస్తే రూ. 15 వేలు చెల్లించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.

పాదయాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొన్నట్టుగా జగన్ వివరించారు. ప్రజల కస్టాలను తీర్చుతానని ఆయన భరోసా ఇచ్చారు.  వైసీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తోందని చెప్పారు.

మనిషికి మనసు ఉంటే ఎదుటవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. ప్రభుత్వానికి మనసు ఉంటే...మనిషికే కాదు, ఇంటింటికీ మేలు చేయాలనుకుంటుంది. ఇటువంటి ప్రభుత్వం, పాలన....వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితోనే అలాంటి పాలనతోనే వెళ్లిపోయింది. బాగుపడేందుకు ప్రభుత్వపరంగా మనం ఏం చేయాలి అనే పరిస్థితి ఈ అయిదేళ్లలో ఎక్కడా కనిపించలేదని ఆయన విమర్శలు గుప్పించారు.

 చీకటి పడితే రోడ్డు మీదకు వెళ్లాలంటే ఆడవాళ్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని నా కళ్లారా చూశాను. మీకు చెబుతున్నా... ఎలాంటి ఆందోళన వద్దు...నేను మీకు భరోసాగా, భద్రతగా ఉన్నానని జగన్ హామీ ఇచ్చారు.