కర్నూలు: తాను ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కర్నూలు జిల్లా నందికొట్కూరు ర్యాలీలో ప్రసంగించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పేదల బతుకులు ఏ మాత్రం మారలేదని ఆయన అన్నారు. 

చంద్రబాబు దేశంలో అత్యంత ధనికి సీఎంగా నిలిచారని జగన్ అన్నారు. సీఎంగా రైతులకు, నిరుద్యోగులను ఆదుకోవడం పక్కన పెట్టి పేదలసొమ్ముని దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కువ రుణభారం మన రాష్ట్రానికి చెందిన రైతులపైనే ఉందని ఆయన అన్నారు. 

టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని, రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని, ప్రత్యేక హోదాను ముందుగా ప్రకటించిన వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పారు.

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హమీలను ఇచ్చారని,  ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కటీ కూడా అమలుచేయ్యలేదని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు దాదాపు లక్షకు పైగా ఉద్యోగాలు తొలగించారని ఆయన అన్నారు. 

తాము అధికారంలోకి రాగానే ప్రతిఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, తొలిఏడాదే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జగన్ చెప్పారు. రాష్ట్రాంలోని పరిశ్రమల్లో ఇప్పుడు చాలామంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని, అన్ని పరిశ్రమల్లో స్థానికలకే 75శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా శాసనసభలో చట్టం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

పిల్లల్ని బడికి పంపితే చాలు ఏడాదికి 15వేలు చేతిలో పెడతామని చెప్పారు. పేద పిల్లల్ని ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి పెద్దపెద్ద చదువులను చదవిస్తామని చెప్పారు. పెట్టుబడి కోసం ప్రతి రైతుకు ఏడాదికి 15వేలు ఇస్తామని చెప్పారు.