పాలకొల్లు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పార్ట్నర్, యాక్టర్ అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నారని ఆరోపించారు. 

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ జగన్ పవన్ పై విరుచుకుపడ్డారు. మాజీమంత్రి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయాలు చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు నాయుడుతో కలిసి వంతపాడతారా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కుటుంబం చల్లగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు జగన్ ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను చంద్రబాబు చంపిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని నిలదీశారు. 

మీ కుటుంబంలో ఎవరికి ఏమీ కాకూడదన్న జగన్ కానీ మీ కుటుంబంలో ఒక వ్యక్తిని చంద్రబాబు హత్య చేసి మీ కుటుంబ సభ్యులే హత్య చేశారు అని అంటే మీరు ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. 

చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలనే మీరు చెయ్యడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో నాలుగేళ్లు కాపురం చేసిన మీరు చంద్రబాబు చేసిన ప్రతీ అన్యాయంలో మీ పాత్ర లేదా అని నిలదీశారు. 

నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు బిల్డప్ లు ఇస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తే ఆ ర్యాలీలో టీడీపీ జెండాలే ఎక్కువగా కనిపించాయని చెప్పారు. నాలుగేళ్లు ప్రజా వ్యతిరేక పాలన అందించిన చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి తమను ప్రశ్నిస్తారని విరుచుకుపడ్డారు. 

ఎన్నికల ప్రచారంలో మైకు పట్టుకుంటే చాలు జగన్ జగన్ అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య ఇండైరెక్ట్ పొత్తు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు గమనించించాలని వైఎస్ జగన్ హితవు పలికారు.