గుంటూరు:తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కోసం రూ. 4 వేల కోట్లతో  ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

గుంటూరు జిల్లా రేపల్లే నియోజకవర్గంలో ఆదివారం నాడు జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంట దిగుబడి సమయంలో ధరలు తగ్గుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తన కంపెనీ కోసం  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్నం పెట్టే రైతు ఆకలితో అలమటిస్తున్నాడని జగన్ చెప్పారు.

రైతాంగం వద్ద ఉన్న భూములను టీడీపీ సర్కార్ బలవంతంగా లాక్కొంటుందని ఆయన  విమర్శించారు. రైతులు మృత్యువాత పడితే ఆ రైతు కుటుంబానికి రూ. 7 లక్షలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  20 రోజులు ఓపిక పడితే వైసీపీ అధికారంలోకి వస్తోందని ఆయన  ధీమాను వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబునాయుడు అనేక మాటలు చెబుతారన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రూ.3 వేలు ఇస్తాడన్నారు. ఈ మూడు వేలు తీసుకొని మోసపోకూడదని  ఆయన సూచించారు.

45 ఏళ్లు నిండిన మహిళలకు రూ.75 వేలను  మహిళలకు ఇవ్వనున్నట్టు ఆయన  హామీ ఇచ్చారు. పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులను కూడ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.