అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ఓ దగా కోరు అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుత్తూరులో వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడిన ఆమె చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

రైతులకు కరువు రావాలంటే చంద్రబాబు రావాలి. ఎరువు కావాలంటే జగన్‌ రావాలి. వరి కావాలంటే జగన్ రావాలి ఉరి కావాలంటే చంద్రబాబు రావాలంటూ విరుచుకుపడ్డారు. అధికారం కోసం అడ్డమైన గడ్డికరిచే వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 

అబద్దాలతో పాలన సాగించే వ్యక్తికావాలా, మాటతప్పని మడమ తిప్పని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లపాలనలో అరుంధతీనక్షత్రాన్ని చూపించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

అమరావతి రాజధానిని సింగపూర్ చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు గ్రాఫిక్స్ లో భ్రమరావతిగా మార్చేశారని ధ్వజమెత్తారు రోజా. మనవడు దేవాన్ష్ పేరిట రూ.19కోట్లు ఆస్తులు కూడబెట్టిన చంద్రబాబు పుట్టిన ప్రతీ బిడ్డపై రూ.60వేలు అప్పులు సృష్టించాడని ఆరోపించారు. 

తన భార్య ఆస్తులను ఐదురెట్లు పెంచిన చంద్రబాబు రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్లు అప్పుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. 

చిత్తూరులో చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతుంటే బాబు కోడలు మాత్రం ఐస్‌క్రీమ్‌ కంపెనీలు ప్రారంభిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మూడు సార్లు సీఎం అయినా సొంత జిల్లాకు చేసిందేంలేదంటూ మండిపడ్డారు. 

దివంగత సీఎం వైఎస్‌ హయాంలోనే నగరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. గాలేరు - నగరి ప్రాజెక్ట్‌ పూర్తయితేనే పుత్తూరులో నీటి సమస్య తీరుతుందని రోజా స్పష్టం చకేశారు. 

అంతేకాదు వైఎస్ జగన్ పొలిటికల్ సూపర్ స్టార్, అసెంబ్లీ టైగర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రాజన్న ముద్దుబిడ్డ, రాయలసీమ ముద్దుబిడ్డ, కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ రోజా స్పష్టంచేశారు.