విజయనగరం జిల్లాకు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి అమలు చేయలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.

విజయనగరాన్ని స్మార్ట్‌సిటీగా చేయడంతో పాటు మెడికల్ కాలేజీ, ఫుడ్ పార్క్, గిరిజన యూనివర్సిటీ, నదుల అనుసంధానం, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేశానని సీఎం ఇచ్చిన వాగ్థానాలు అమలుకు నోచుకోలేదని జగన్ మండిపడ్డారు.

జిల్లాలోని జూట్ మిల్లులు,  ఫెరోలైజ్ కంపెనీలు మూతపడ్డాయన్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లంచాలు ఇవ్వలేదన్న కారణంగా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను చంద్రబాబు రద్దు చేశారని ధ్వజమెత్తారు.

రాష్ట్రప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేవామిత్ర యాప్‌లోకి లోడ్ చేసి, ఈ డేటాను జన్మభూమి కమిటీలకు బాబు అప్పగించారని జగన్ ఆరోపించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నాయకులు దొరికితే వాళ్లకు చంద్రబాబు భద్రత ఇచ్చారని ఎద్దేవా చేశారు.

విభజన హామీలు అమలు జరగకపోయినా బీజేపీ నేతలకు సన్మానాలు, సత్కారాలు చేయడంతో అసెంబ్లీలో తీర్మానాలు చేశారని జగన్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కబ్జా చేసి ఎన్టీఆర్‌కే భద్రత ఇవ్వలేని వ్యక్తి రాష్ట్రానికి భద్రత ఎలా ఇస్తారని మండిపడ్డారు.

చంద్రబాబు తానే హత్యలు చేయించి ఆ నెపాన్ని ఎదుటి వాళ్ల మీదకు వేస్తారని జగన్ ఆరోపించారు. పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాకుండా వారిని మంత్రి పదవుల్లో సైతం కూర్చోబెట్టారని వైసీపీ అధినేత ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రావడం కోసం ఉన్న ఓట్లను పీకించి, దొంగ ఓట్లను ఎక్కించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చేట్టారని ఆయన ఆరోపించారు. డేటా లీక్ మీద చంద్రబాబు స్థాపించిన సిట్ అర్థం సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అండే స్టాండ్ అని జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.