3648 కిలోమీటర్లు నడిచి, 13 జిల్లాల ప్రజల కష్టాలను కళ్ళారా చూశానన్నారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విశాఖ జిల్లా నర్సీపురంలో బహిరంగసభలో పాల్గొన్నారు. 108 అంబులెన్స్‌లు సమయానికి రాకపోవడం, ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడాన్ని పాదయాత్రలో చూశానన్నారు. ]\

సాయం కోసం ఎదురుకచూస్తున్న ప్రతీకుటుంబానికి అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మా చిన్నాన్నను దారుణంగా చంపారన్నారు.  గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదేనని జగన్ హామీ ఇచ్చారు. ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకు ఇచ్చేలా చట్టం చేస్తానన్నారు. అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని, ఆస్తులు ఎవరూ ఆక్రమించకుండా కఠినమైన చట్టాలు చేస్తామని జగన్ ప్రకటించారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి, చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు ధర్మానికి.. అధర్మానికి మధ్య జరగుతున్నవిగా వైసీపీ చీఫ్ అభివర్ణించారు. మట్టి నుంచి ఇసుక వరకు అన్నింట్లో అవినీతి రాజ్యమేలుతుందన్నారు.

ఆడపడుచు అని కూడా చూడకుండా ఎమ్మార్వోలను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న ఎమ్మెల్యేలను చూశామని జగన్ గుర్తు చేశారు. తల్లిదండ్రులపై చదువుల భారం లేకుండా చేస్తానని, రానున్న రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

ఐదు సంవత్సరాలలో ప్రతి నిరుపేదలను లక్షాధికారులుగా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదా సాధిస్తానని జగన్ తెలిపారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపుతారని అదంతా అవినీతితో సంపాదించిందేనని జగన్ ఆరోపించారు.

చంద్రబాబు ఇచ్చే రూ.3000కు ఆశ పడొద్దని ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. వైసీపీ ముందుగా ప్రకటించడం వల్లనే చంద్రబాబు రూ.1000 పెన్షన్‌ను రూ.2000కు పెంచారని జగన్ ఆరోపించారు.