ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకొక డ్రామా చూపిస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నెల్లూరు జిల్లా గూడురులో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.

పాదయాత్రలో అందరి కష్టాలను విన్నానని, బాధలను చూశానని... మీ అందరికి నేనున్నానే భరోసా ఇస్తున్నానన్నారు. విభజన చట్టంలో దుగరాజపట్నం పోర్ట్ నిర్మించాలని ఉన్నా.. కృష్ణపట్నం పోర్ట్ చాలంటూ చెప్పడానికి చంద్రబాబు ఎవరని జగన్ ప్రశ్నించారు.

చంద్రబాబు పాలనలో ప్రతి ప్రతి అడుగులో మోసం తప్ప మరొకటి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందని... రోజుకొక మోసం, కుట్ర వెలుగులోకి వస్తున్నాయని జగన్ మండిపడ్డారు.

రానున్న రోజుల్లో కుట్రలు మరింత ఎక్కువౌతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన పోరాటం చంద్రబాబుతోనే కాదని, ఎల్లో మీడియాతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో గూడురు వైసీపీ అభ్యర్థి మాజీ ఎంపీ వరప్రసాద్, తిరుపతి లోక్‌సభ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు.