ఓట్ల కోసం నాయకులు ఈ ఎన్నికల సమయంలో నానా తంటాలు పడతారు. పదవిలో ఉన్నంతకాలం జనాల ముఖం కూడా చూడని వారు కూడా ఎన్నికలు వచ్చాయి అనగానే.. ప్రచారంలో దూసుకుపోతుంటారు. గ్రామగ్రామానికి తిరుగుతూ.. ఓట్ల కోసం ప్రజలను అభ్యర్థిస్తారు. వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తారు. కొత్త కొత్త పథకాల గురించి వివరించి ప్రజల్లో ఆశలు నింపుతారు.

దాదాపు ఏ నాయకుడైనా ఇలానే వ్యవహరిస్తాడు అయితే.. ఓ వైసీపీ అభ్యర్థి మాత్రం నాకు మీ ఓట్లు వద్దు... ఏమీ వద్దు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వింత సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తివివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, గంగాధర్ నెల్లూరు నియోజక వర్గం వైసీపీ అభ్యర్థి నారాయణ స్వామికి ఎదురైంది. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు మండలం, పెద్దదామరకుంట దళితవాడలో ప్రచారానికి వెళ్లిన ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో తమ గ్రామానికి గుడి కట్టిస్తామని, రోడ్లు వేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు నిలదీశారు. దీంతో నారాయణ స్వామికి, గ్రామస్తులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరికి ఆయన మీ ఓట్లు తనకు వద్దంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు.