ఒంగోలు: అధికారంలోకి రాగానే రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు.

బుధవారం నాడు ఒంగోలులో నిర్వహించిన ఎన్నికల సభలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాల్గొన్నారు.అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబునాయుడు, లోకేష్, చంద్రబాబునాయుడు బినామీ మంత్రులు  కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క పైసా కూడ ఇవ్వలేదన్నారు.

పేదవాడిని కూడ వదిలిపెట్టకుండా చంద్రబాబునాయుడు దోచుకొంటున్నాడని  జగన్  విమర్శించారు. ఒంగోలు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. కనీసం ప్రతిరోజూ తాగునీరు కూడ ఇవ్వలేని పరిస్థితి ఏపీ సర్కార్‌దని ఆయన దుయ్యబట్టారు.

ఈ ఐదేళ్లలో చంద్రబాబునాయుడు అత్యంత ధనవంతుడైన సీఎం అంటూ నివేదికలు వస్తున్నాయని జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన రైతులు అత్యంత పేదలుగా ఉన్నారని ఆయన విమర్శించారు.

చంద్రబాబునాయుడు వస్తే జాబులు వస్తాయని ప్రచారం చేసుకొన్నారని....ప్రజలకు ఉద్యోగాలకు రాలేదని జగన్ చెప్పారు. కానీ తన కొడుకు లోకేష్‌కు చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఉద్యోగంతో పాటు ప్రమోషన్ ఇచ్చి మంత్రిని కూడ చేశారని జగన్ దుయ్యబట్టారు.జాబు రావాలంటే బాబు పోవాలని ప్రజలు కోరుకొంటున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. 

57 నెలలు చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలకు అన్యాయం చేశారన్నారు. కానీ, మూడు నెలలు మాత్రమే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ప్రచారం చేసుకొంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు.