Asianet News TeluguAsianet News Telugu

అదే భూమిలో పాతేస్తాం: పవన్ కల్యాణ్ హెచ్చరికలు

చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో త‌న మ‌న తేడాలు ఉండవని పవన్ తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం అమ‌లాపురంలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. 

Pawan Kalyan warns sand mafia of AP
Author
Amalapuram, First Published Apr 8, 2019, 10:39 PM IST

అమలాపురం: ఇసుక మాఫియా, మ‌ట్టి మాఫియాల‌కు జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అమలాపురం వేదిక నుంచి ఘాటుగా హెచ్చ‌రికలు చేశారు. భూమాత‌ను అడ్డంగా త‌వ్వేవారిని అదే భూమిలో పాతేస్తామ‌న్నారు. ఇసుక త‌వ్వ‌కాలు ఓ క్ర‌మ  ప‌ద్ద‌తిలో లేని ప‌క్షంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 

చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో త‌న మ‌న తేడాలు ఉండవని పవన్ తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం అమ‌లాపురంలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌చ్చిన రెండు సంవ‌త్స‌రాల్లో స‌ఖినేటిప‌ల్లి-న‌ర‌సాపురం మ‌ధ్య వ‌శిష్ట వార‌ధి పూర్తి చేస్తామని, గ‌ల్ఫ్ బాధితుల కోసం ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌త్యేక మంత్రిత్వ‌ శాఖ ఏర్పాటు చేసి ర‌క్ష‌ణ క‌ల్పిస్తామని హామీ ఇచ్చారు. 

చుట్టూ గోదావ‌రి ఉన్నా తాగు నీటికి క‌ట‌క‌ట ఉండ‌టం తనను బాధించిందని అన్నారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటైన ఐదారు నెల‌ల్లో తాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామని హామీ ఇచ్చారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 9 నెల‌ల కాలంలో అమ‌లాపురంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రో సంబంధిత విశ్వ‌విద్యాల‌యాన్ని అమ‌లాపురానికి  తీసుకువ‌స్తామని చెెప్పారు. 

"ఇక్కడ ఆ యూనివర్సిటీ అవసరం ఉంది. ప్ర‌తి ఎక‌రానికి సాగు నీరు అందించే ఏర్పాటు చేస్తాం. కోన‌సీమ‌లో కోకోన‌ట్ బోర్డు ఏర్పాటు చేసి, కొబ్బ‌రి సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల అభివృద్దికి కృషి చేస్తాం. కొబ్బ‌రి పీచు ప‌రిశ్ర‌మ‌కు అమ‌లాపురంని కేంద్రంగా చేస్తాం. రూ. 5 వేల కోట్ల‌తో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో గ్లోబ‌ల్ మార్కెటింగ్ వ్‌నవ‌స్థ‌ను రూపొందించి వ్య‌వ‌సాయ‌, ఆక్వా ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌కు కృషి చేస్తాం. లంక భూముల కోత‌ను అరిక‌ట్టేందుకు బ‌ల‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం" అని అన్నారు. 

"మ‌త్య్స‌కార యువ‌త‌తో స్పెష‌ల్ కోస్ట్ గార్డ్‌, మెరైన్ పోలీస్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసి తీర ప్రాంత ర‌క్ష‌ణ బాధ్య‌త‌తోపాటు కోత‌ను అడ్డుకునే మడ అడవుల్ని కాపాడతాం. కోన‌సీమ ప్రాంతానికి రూ. 2 వేల కోట్లు కేటాయించి ప‌ర్యాట‌కంగా అభివృద్ధిప‌రుస్తాం. త‌ద్వారా ల‌క్ష ఉద్యోగాలు తీసుకువ‌చ్చే బాధ్య‌త జ‌న‌సేన ప్ర‌భుత్వం తీసుకుంటుంది" అని చెప్పారు.  

"డిఎంఆర్ శేఖ‌ర్ ని అమ‌లాపురం పార్ల‌మెంటు అభ్య‌ర్ధిగా గెలిపిస్తే కోటిప‌ల్లి-న‌ర‌సాపురం రైల్వే లైన్ పనులు పురోగతి గురించి పార్ల‌మెంటులో బ‌ల‌మైన పోరాటం చేస్తారు. చేనేత‌ను జౌళి మంత్రిత్వ శాఖ నుంచి విడ‌దీసి ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర బ‌డ్జెట్‌లో ప‌ది శాతం నిధుల్ని చేనేత‌కు కేటాయించే అంశాన్ని ప‌రిశీలిస్తాం" అన్నారు.

"చేనేత‌ను ప్ర‌త్యేక ప‌రిశ్ర‌మ‌గా గుర్తించే అంశాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఏడాదిలో ఒక రోజును చేనేత ఆత్మ‌గౌర‌వ దినంగా ప్ర‌క‌టిస్తున్నాం. ఆ రోజు రాష్ట్ర ప్ర‌జ‌లు మొత్తం చేనేత వ‌స్త్రాలు ధ‌రించే ప‌రిస్థితులు క‌ల్పిస్తాం. బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో చేనేత‌ల‌కు రాజ‌కీయంగా అవ‌కాశం క‌ల్పిస్తాం" పవన్ కల్యాణ్ వివరించారు. 

"అన్ని కులాలు, మ‌తాల‌తో మ‌మేక‌మై బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్న ప్రాంతాల్లో కేంద్రంలో సైతం ప‌ద‌వులు అందుకునే స్థాయి క‌ల్పిస్తాం. 
వేలాదిగా ఉన్నలారీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లకు రూ. 25 కోట్ల‌తో ప్రొటెక్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. కొత్తగా ఆటోలు కొనుక్కునే డ్రైవర్లకు 30 శాతం సబ్సిడీతో పాటు మొదటి మూడు ఈఎంఐలు ప్రభుత్వమే కడుతుంది" అని చెప్పారు. 

"ఆటో ఖ‌రీదు ల‌క్ష‌న్న‌ర ఉంటే అందులో రూ.50 వేలు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. బ‌కాయిలు ఉన్న పాత ఆటో డ్రైవ‌ర్ల‌కు రూ. 10 వేలు గ్రాంట్ ఇస్తాం. ఇళ్లు లేని వారికి కుల‌, మ‌తాల‌కు, పార్టీల‌కు అతీతంగా బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మించి శాశ్వత గృహాలు ఏర్పాటు చేస్తాం. సంపాద‌న‌తో సంబంధం లేకుండా ఇళ్లు క‌ట్టించి ఇచ్చే బాధ్య‌త తీసుకుంటాం" చెప్పారు.

"కేజీ బేసిన్‌లో గ్యాస్ నిల్వ‌ల‌ను రిల‌య‌న్స్‌, ఓఎన్‌జీసీలు ఇష్టారాజ్యంగా తీసుకుపోతున్నారు. చంద్ర‌బాబు గారు గానీ, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గారు గాని అడ‌గ‌రు. అడిగితే మాకు వాటాలు ఎంతిస్తారు అని మాత్ర‌మే అడుగుతారు. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు అయితే రిల‌య‌న్స్ యాజ‌మాన్యంతో మాట్లాడి మ‌న‌కు రావాల్సిన వాటా మ‌న‌కి ద‌క్కే ఏర్పాటు చేస్తాం" అని అన్నారు. 

"అందుకే ఆడ‌ప‌డుచుల కోసం ప్ర‌తి కుటుంబానికి ఆదాయంతో సంబంధం లేకుండా జ‌న‌సేన ప్ర‌భుత్వం ప‌ది గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా అందిస్తామ‌ని ధైర్యంగా చెబుతున్నాం" అని అన్నారు. "ఆడ బిడ్డ‌ ప్ర‌తి ఇంటికి మ‌హాల‌క్ష్మీ అని, అటువంటి మ‌హాల‌క్ష్ముల‌ వివాహానికి ‘మా ఇంటి మ‌హాల‌క్ష్మీ’ ప‌థ‌కం కింద ల‌క్ష రూపాయ‌లు అందిస్తాం. ‘పుట్టింటి సారె’ కింద ప‌దివేల నూట‌ప‌ద‌హార్లు ఇస్తాం. రేష‌న్‌కి బ‌దులు రూ. 2500 నుంచి రూ. 3500 మ‌హిళ‌ల ఖాతాల్లో జ‌మ చేస్తాం.  60 సంవ‌త్స‌రాలు నిండిన రైతుల‌కు రూ. 5 వేల పెన్ష‌న్ ఇస్తాం" అని పవన్ కల్యాణ్ హామీల వర్షం కురిపించారు.  

"చిరు వ్యాపారుల‌కు ఎలాంటి పూచీక‌త్తు లేకుండా ప‌ది వేల వ‌ర‌కు రుణ స‌దుపాయం క‌ల్పిస్తాం. ఆరు నెల‌ల్లో మూడు ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేయిస్తాం. అన్ని పోటీ ప‌రీక్ష‌ల‌కు ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే ఫీజు చెల్లించే ఏర్పాటు చేస్తాం. బంగారు న‌గ‌ల తాక‌ట్టు మీద ఏడాది లోపు పావ‌లా వ‌డ్డీకి , ఏడాది దాటిన రుణాల మీద 50 పైస‌లు వ‌డ్డీ కింద రుణాలు ఇప్పిస్తాం" అని వివరించారు.

"కులాల్ని వాడుకుని నాయ‌కులు ఎదిగే స‌మాజంలో ఓ బ‌ల‌మైన మార్పు కోసం ముందుకు వెళ్తున్నాం. చాలా మంది కాపు నాయ‌కులు తోట త్రిమూర్తులు లాంటి వారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మేం చాలా న‌లిగిపోతున్నాం, ఇన్నాళ్లు ప‌ల్ల‌కీలు మోశాం అని చెబుతుంటే వింటూ వ‌చ్చా" అని చెప్పారు. 

"నేను అయితే ఎవ‌ర్నీ పార్టీలోకి ర‌మ్మ‌న‌లేదు, ఆహ్వానించ‌లేదు. ఇష్ట‌ప‌డి వ‌స్తాం అంటే సంతోషం అన్నాను. ఇలా మాట‌లు మార్చే మీలాంటి వ్య‌క్తుల్ని చెంచాలు అంటారు. చెంచా అంటే చెయ్యి ఎటుతిప్పితే అటు తిరిగేది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వాళ్ల ప‌ల్ల‌కీలు మోశాం, కొత్త బాధ్య‌త‌తో కూడిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ నిర్మిద్దామ‌న్న స‌దుద్దేశంతో, వేల కోట్లు లేకుండా, కేవ‌లం ఆశ‌యం అన్న బ‌లంతో ముందుకు వ‌స్తే, సొంత కులం అని చెప్పి వ‌చ్చిన వారే దెబ్బ కొడుతున్నారు" అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios