భీమవరం: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా, తెలంగాణా ఏమన్నా పాకిస్థాన్‌ అనుకుంటున్నారా అని ఆయన అడిగారు. పౌరుషం లేదా అని ప్రశ్నించారు. 

మనమింకా బతికున్నామని, ఇంకా విభజించే రాజకీయాలు చేయవద్దని పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే వదిలేసే ప్రసక్తి లేదని అన్నారు. భయపడుతూ ఎంతకాలం ఉంటామని, ధైర్యంగా ఉందామని ఆయన అన్నారు. భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే అలాంటి నాయకుల్ని మీ నాయకుడు జగన్‌ భుజానికెత్తుకెళ్తుంటే మీకెలా మనసొప్పుతోందని వైసిపి నాయకులను అడగాలని ఆయన అన్నారు.

అంత హీనంగా తిడుతుంటే.. మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉంటుంటే మీకు పౌరుషమే రాలేదా అని ఆయన వైసిపి అభ్యర్థులను ప్రశ్నించారు.  తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్పా.. కేసీఆర్‌ మాత్రం ఆంధ్ర రాజకీయాలలో వేలు పెట్టవచ్చా అని ప్రశ్నించారు. ఆయనకు ఆంధ్రా మీద అంత అభిమానం ఉంటే తన అభ్యర్థులను పోటీ చేయింవచ్చునని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తారా, వారితో వైసీపీ వారు వంత పాడుతారా అని పవన్ విమర్శించారు. 2014లో తలసాని తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఎన్నో తిట్లు తిట్టాడని, తన ప్రచారం కోసం ఎదురుచూశారని అన్నారు. పవన్‌ ఎక్కడ అంటూ పదే పదే ఫోన్‌లు చేస్తూ ఎదురుచూశారుని చెప్పారు. 

దయచేసి విభజన రాజకీయాలను మానేయాలని ఆయన తలసానికి సూచించారు. జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది తప్ప తనకు ఆయనంటే భయం లేదని పవన్ అన్నారు. అక్కడేదో తనకు ఇల్లుందని, ఆస్తులున్నాయని, పదెకరాల భూములున్నాయనే భయం తనకు లేదని ఆయన అన్నారు ఏం భూములు తీసుకుంటారా? తీసుకోమనండని అన్నారు. ఎవడు తీసుకుంటాడు తెలంగాణలో మన ఇల్లు.. మన భూములు.. తాను చూస్తానని అన్నారు
 
తెలంగాణలో తనను కొట్టడానికి వంద మంది వచ్చారని పవన్‌ చెప్పారు.  ఆ రోజున నేను తెలంగాణలో సభ పెడితే నన్ను కొట్టడానికి దాదాపు ఒక 100 మంది జనంలో దూరిపోయారని అన్నారు. సత్యం మాట్లాడతామని, తప్పుంటే సరిదిద్దుకుంటామని, తప్పు చేస్తే తోలు తీస్తాం. మాట్లాడతామని అన్నారు. తను తన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు తనను ఎన్ని లక్షల మంది బెదిరించినా ఆపలేదని, ఆ రోజు తనను కొట్టడానికి వచ్చినవాళ్లు కూడా చప్పట్లు కొట్టి వెళ్లిపోయారని పవన్‌ అన్నారు.