కేసీఆర్ సూచించిన వ్యక్తులకే వైసీపీ చీఫ్ జగన్ టిక్కెట్లను ఇచ్చారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనపై ఇష్టమొచ్చినట్టు విజయసాయిరెడ్డి మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు
కైకలూరు: కేసీఆర్ సూచించిన వ్యక్తులకే వైసీపీ చీఫ్ జగన్ టిక్కెట్లను ఇచ్చారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తనపై ఇష్టమొచ్చినట్టు విజయసాయిరెడ్డి మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. పులివెందుల రాజకీయాలను చేయాలని చూస్తే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు.
ఆదివారం నాడు కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తాను భరించలేనని చెప్పారు. మార్పు కోసమే తాను రాజకీయాలకు వచ్చినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.
చంద్రబాబునాయుడు తన క్యాంపు కార్యాయలంలో బీ ఫారాలు ఇచ్చారని, జగన్ హైద్రాబాద్‌లో కేసీఆర్ సూచించిన వారికి టిక్కెట్లిస్తే జనసేన ఒక్కటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో టిక్కెట్లను ఇచ్చిందని చెప్పారు. పులివెందుల రాజకీయాలు చేయాలని చేస్తానంటే చూస్తూ ఊరుకోబోనని ఆయన హెచ్చరించారు.
రాయలసీమను రక్తాలసీమగా మార్చారన్నారు. జనసేన కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాను తీసుకు రాలేదన్నారు. చంద్రబాబునాయుడు, జగన్ కుటుంబాలే రాజకీయాలు చేయలా అని ఆయన ప్రశ్నించారు.పాత కోటలను బద్దలు కొట్టి మార్పును తీసుకురానున్నట్టు పవన్ చెప్పారు.
