విశాఖ: చిన్నాన్న హత్యపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రక్తం మరకలు, వేలిముద్రలు ఎందుకు తుడిచారని ఆయన ప్రశ్నించారు. జగన్ 10 వజ్రాలు ఇస్తానంటాడని, నమ్మొద్దని అన్నారు. జగన్‌ను వరంగల్‌లో రాళ్లతో కొట్టించిన కేసీఆర్ ఇప్పుడు మద్దతు ఇస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. 

రిటర్న్ గిఫ్ట్ అంటే పగలూ ప్రతీకారాలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ళని దోపిడీదారులని తెలంగాణ నేతలు అంటే ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. వైసీపీ వస్తే భూకబ్జాలే కాదు.. మీ ఇల్లు, ఆ కొండ, కొండమీద పుట్ట, కొండపైన చెట్టూ దోచేస్తారని ఆయన అన్నారు. గురువారం విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన జరిగిన బహిరంగ సభలో, భిమిలీ, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో  జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు.

సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ పదేళ్ల క్రితం వైసీపీ నాయకుడు జగన్‌కు బిగిస్తే నేటికీ కేసులతో కొట్టుకుంటున్నాడని పవన్ కల్యాణ్ అన్నారు. జీవితకాలం బయటకు రాలేకపోవచ్చునని అన్నారు. చిన్న టీచర్‌ కొడుకైన మధ్య తరగతివ్యక్తి  లక్ష్మీనారాయణని విశాఖ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేశామని, వైసీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రచారానికి బయటకు వస్తారో చూస్తానని అన్నారు.

ప్రధాని మోడీని చూస్తే జగన్‌కు వెన్నులో వణుకు అని, ప్రత్యేక హోదా అని నోరెత్తితే.. ఇవిగో నీ కేసులు.. ఈడీ కేసులంటూ ఫైల్స్‌ చూపడంతో కిమ్మనడం లేదని అన్నారు. వైసీపీ కిరాయి మూకలను తీసుకొచ్చి వైజాగ్‌ పవిత్రతను చెడగొట్టాలని చూస్తే సహించబోమని, అయినా లక్ష్మీనారాయణ వచ్చారు కనుక వైజాగ్‌లో వైసీపీ వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. 

వైసీపీ దోపిడీని అంతమొందించడానికే విశాఖకు కొత్వాల్‌ లాంటి లక్ష్మీనారాయణను తీసుకొచ్చామని, ఆయన అన్యాయం చేస్తే తోలు తేసే కొత్వాల్‌ అని పవన్ అన్నారు. పులివెందుల కిరాయి మూకలకు, రౌడీలకు భయపడబోమని, భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాల ని చూస్తున్నారని అన్నారు. 

వీవీ లక్ష్మీనారాయణ  జనసేనలోకి రాగానే ఏ-2 విజయసాయిరెడ్డికి ట్వీట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్ ప్రశ్నించారు. పులివెందులలో పుడితే భయపడతారనుకుంటున్నారేమో అని అన్నారు. జగన్‌, విజయ్‌సాయిరెడ్డీ.. గుర్తుపెట్టుకోండి. నందికొట్కూరులోని కొణిదెల నా ఇంటి పేరు. కిరాయి మూకలకు భయపడే ప్రసక్తే లేదని పవన్ అన్నారు.