శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి దెబ్బ పడింది. శనివారం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు.

పవన్ కల్యాణ్ హెలికాప్టర్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో రోడ్డు మార్గాన ప్రయాణించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు పవన్ కల్యాణ్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పలాస, కాశీబుగ్గ, టెక్కలి, పాతపట్నం ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించాల్సి ఉండింది. అయితే, చంద్రబాబు ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చాపురం, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 

చంద్రబాబు శనివారం రాత్రి శ్రీకాకుళంలోనే బస చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ శ్రీకాకుళం పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కాగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తున్నారు.