కృష్ణా జిల్లాలో నందిగామలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ సందడి చేశాడు.
కృష్ణా జిల్లాలో నందిగామలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ సందడి చేశాడు. సీఎంతో పాటు తల్లి నారా బ్రాహ్మణీతో పాటు అక్కడికి వచ్చిన ఈ చిన్నారి సభ ప్రారంభానికి ముందు తొలుత ఎన్టీఆర్ విగ్రహంపై పూలు చల్లి వినమ్రంగా నమస్కరించాడు.
తర్వాత తన తాత చూపుతున్నట్లు జనానికి విక్టరీ సింబల్ చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు... దేవాన్ష్‌ను ఇక్కడకు తీసుకురావడం వెనుక గల కారణాన్ని వివరించారు.
ఉదయం ఎన్నికల సభకు బయలుదేరుతుండగా ‘‘తాతా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు’’ అంటూ దేవాన్ష్ తనను ప్రశ్నించాడని,.. ప్రచారానికి వెళుతున్నానని చెప్పానని.. అయితే తాను పడుతున్న కష్టం తెలియజేయాలన్న ఆలోచనతో దేవాన్ష్‌ను సభకు తీసుకువచ్చానని సీఎం తెలిపారు.
చిన్నతనం నుంచే సామాజిక స్థితిగతులు తెలియజేయడం ద్వారా ప్రజల పట్ల అతని మనసులో సానుకూల దృక్పథం అలవరచవచ్చు అని చంద్రబాబు వివరించారు. దేవాన్ష్ ఒక్కడే తన మనవడు కాదని.. రాష్ట్రంలోని పిల్లలందరూ తన మనుమలు, మనవరాళ్లేనని పేర్కొన్నారు.
పిల్లలందరికీ తానే గార్డియన్‌గా ఉండి.. వారి బంగారు భవితకు బాట వేస్తానని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు దేవాన్ష్ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఆసక్తిగా తాత వంక చూస్తూ కూర్చొన్నాడు.
