ఎన్నికల వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేయడం సహజం. అయితే.. కొందరు నేతలు మాత్రం పార్టీ మారినా.. పాత పార్టీ వాసనను మాత్రం వీడడం లేదు. తెలంగాణలో నామా నాగేశ్వరరావు, సండ్రలు సైకిల్ కి జై కొట్టగా.. ఏపీలో గౌరు చరితా రెడ్డి జగన్ కి జైకొట్టారు.

గౌరు  చరితా రెడ్డి ఇటీవల వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆమెకు కర్నూలు జిల్లా పాణ్యం టికెట్ ను టీడీపీ కేటాయించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన ఆమె తనకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తన ప్రసంగాన్ని ముగిస్తూ జై జగన్‌ అంటూ నాలుక్కరుచుకున్నారు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమె జై చంద్రబాబు అంటూ తన తప్పిదాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. 

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లు తమకు తోచిన కామెంట్స్‌ చేస్తున్నారు. మేడమ్‌ మీరు పార్టీ మారారు.. మర్చిపోయారా? అని ఒకరు.. పార్టీ మారినా మనసంతా వైఎసీపీపైనే అని మరొకరు సెటైర్లు వేస్తున్నారు. కాగా గత ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఈ  ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించకపోవడంతో.. టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.