లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును కేంద్రంలో చక్రం తిప్పేలా చేయాలని పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన చంద్రబాబుతో కలిసి కృష్ణాజిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ప్రధాని మోడీ పోవాలని, ఏపీలో చంద్రబాబు రావాలని కేజ్రీవాల్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడు చంద్రబాబన్నారు. విభజన వల్ల ఆర్ధిక కష్టాలు వచ్చినా, చంద్రబాబు అభివృద్ధి చేసి చూపారని, టీడీపీని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరేందుకే ఇక్కడకు వచ్చానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మనం ఒక్కతాటిపై ఉంటే అనుకున్నది సాధించగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎవరు చేయని విధంగా వృద్ధులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. మోడీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టారని, జగన్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమేనన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.