జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘తొక్క తీస్తా.. తోలు తీస్తానంటున్నావే.. మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావా?’అని పవన్ ని పృథ్వీ ప్రశ్నించారు.

 అవినీతి చేసే టీడీపీ నేతల తోలు తీయ్యండి.. అంతేకానీ నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దని పవన్‌ను హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడని, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థనాయకుడు జనసేన అధ్యక్షడు పవన్‌ అని విమర్శించారు.

గత ఎన్నికల్లో టీడీపీని పవన్ పొగిడి.. ఆ పార్టీని గెలిపించారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా చంద్రబాబుని సీఎం చేయాలని కలలు  కుంటున్నావా అంంటూ ధ్వజమెత్తారు.

ఓటు కూడా ఏ తేదీన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్క మాటైన అన్నావా? నువ్వా ప్రజాక్షేత్రంలో అవినీతిని ప్రశ్నించేది? అని మండిపడ్డారు. ఏప్రిల్‌ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతోపాటు నీ పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులమంతా టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు.