ఆళ్లగడ్డ:  మా ప్రాజెక్టులకు అడ్డం పడినా మా జోలికి వచ్చినా  వదలనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో జగన్ కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారంతా ద్రోహులేనని ఆయన చెప్పారు.

మంగళవారం నాడు కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రసంగించారు. కేసీఆర్‌తో కలిస్తే తప్పు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించడంపై బాబు మండిపడ్డారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్ర ప్రజలను అడుగడుగునా అవమానించారన్నారు. ఆంధ్రులు ద్రోహులు అంటూ కూడ వ్యాఖ్యలు చేశారని చెప్పారు.  ఏపీ ప్రజల ఆస్తులను, ఇళ్లను లాక్కొంటామని బెదిరించారన్నారు. 

ట్యాంక్‌బండ్‌లో విగ్రహలను కూల్చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విజభన కారణంగా ఏపీకి రావాల్సిన వాటా అందలేన్నారు. వాటా పోయింది, లక్ష కోట్లు రావాల్సిందన్నారు.

పోలవరంపై కేసీఆర్ కేసులు పెట్టారని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను తమకు అప్పగించాలని  తెలంగాణ సర్కార్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడులను మూసివేయాలని తెలంగాణ  డిమాండ్ చేస్తున్న విషయాలను ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక  హోదా ఇస్తే తమకు కూడ ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్  చీఫ్ కేసీఆర్ లిటిగేషన్ పెట్టిందని ఆయన విమర్శించారు. భాంచన్ నీ కాల్మొక్తా....అంటూ కేసీఆర్ కాళ్లు మొక్కు అంటూ జగన్‌పై బాబు నిప్పులు చెరిగారు.