నెల్లూరు: టీడీపీ నేత పరిటాల రవిని పార్టీ కార్యాలయంలోనే దారుణంగా హత్య చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలను చంపారన్నారు.కుట్రలు, కుతంత్రాలు చేయడం వైసీపీకి అలవాటేనని ఆయన అన్నారు.ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు.

సోమవారం నాడు ఆయన నెల్లూరులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఎందుకు దాచిపెట్టారని చంద్రబాబునాయుడు జగన్ ‌ను ప్రశ్నించారు. 

వివేకా హత్య ఇంటి దొంగల పనేనని ఆయన అభిప్రాయపడ్డారు. బాబాయ్ హత్య జరిగితే దాచిపెట్టాలని జగన్ చూశారని ఆయన ఆరోపించారు.హత్య తర్వాత ఆధారాలు లేకుండా చేశారని బాబు ఆరోపించారు. 

తన శరీరంలో  ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ ఆటలు సాగనివ్వనని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.ఏపీ ప్రజలను కేసీఆర్ ఎన్నోసార్లు అవమానించారని ఆయన చెప్పారు. తెలంగాణలో రాజకీయ పార్టీలు లేకుండా చేసి ఏపీపై దాడి చేయాలనుకొంటున్నారని ఆయన కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

ఏపీ రాష్ట్రంలో తన మాట వినే వారు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ కోరుకొంటున్నాడని బాబు ఆరోపించారు. మూడువేల సార్లు తిట్టానని కేసీఆర్ కరీంనగర్ జిల్లా సభలో చేసిన విమర్శలను బాబు ప్రస్తావించారు.సీఆర్‌ ఏపీకి రాలేరు కాబట్టి.. కాల్మొక్కుతా అనే జగన్‌ను ఎంపిక చేసుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డబ్బులు పంపి కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.