అనంతపురం:  మన డబ్బులను కొట్టేసి రూ. 500 కోట్లను మనకే బిక్షమేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారని.... కేసీఆర్ బిక్షం తమకు అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. అవసరమైతే తానే  కేసీఆర్‌కు రూ. 1000 కోట్లు ఇస్తానని చంద్రబాబునాయుడు సవాల్ చేశారు.

గురువారం నాడు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై  మరోసారి నిప్పులు చెరిగారు. అమరావతిని హైద్రాబాద్ కంటే  గొప్పగా అభివృద్ధి చేస్తామని భావించికేసీఆర్ జగన్‌‌తో కలిసి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.

అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను ఆహ్వానిస్తే కేసీఆర్ కూడ వచ్చారని చెప్పారు. ఆ సమయంలో ఏపీ కోసం తాను రూ. 500 కోట్లు ఇవ్వాలనుకొన్నానని.... ప్రధానమంత్రే మట్టి, నీళ్లు ఇవ్వడంతో తాను రూ. 500 కోట్లు ఇవ్వడానికి వెనుకంజ వేశానని కేసీఆర్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.

హైద్రాబాద్‌ను తాను అభివృద్ధి చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.  బంగారు బాతు గుడ్లు పెట్టేలా హైద్రాబాద్‌ను తీర్చిదిద్దినట్టుగా ఆయన గుర్తు చేశారు. 31 కేసుల్లో జగన్ నిందితుడుగా ఉన్నాడన్నారు. దేశంలోని అన్ని కేసులు కూడ ఆయనపై ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం చేసినందుకు తనపై ఒక్క కేసు మాత్రమే ఉందని ఆయన వివరించారు.

వైసీపీ వద్ద వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. కేసీఆర్, నరేంద్ర మోడీలు వందల కోట్లను జగన్‌కు పంపారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.