అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాళ్ల అనుచరులపైనే ఆరోపణలు వచ్చాయని, సాక్ష్యాలను తారుమారు చేయడం నేరస్తులకే అలవాటు అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

బాబాయ్‌ని చంపేస్తే, దాచిపెట్టే వ్యక్తిని, పార్టీని ఏమనాలని చంద్రబాబు జగన్ ను ఉద్దేశించి అన్నారు. హత్యను, విషయాన్ని దాచిపెట్టారని, సాక్ష్యాలను తారుమారు చేశారని, దర్యాప్తును దారిమళ్లించారని, వైసీపీ నేతలు చేయని తప్పులేదని ఆయన అన్నారు.
 
రాబోయే 17రోజులు అత్యంత కీలకమైనవని, 25 ఎంపీ సీట్లు, 150కి పైగా అసెంబ్లీ సీట్లలో టీడీపీ గెలవాలని చంద్రబాబు టీడీపి నేతలతో అన్నారు. వైసీపీ, బీజేపీ బరితెగింపు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఫ్రస్టేషన్‌తో బీజేపీ, ఫాక్ష్యన్ ధోరణితో వైసీపీ తప్పుమీద తప్పులు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

నేరాలు-ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అని, అభివృద్ధి-సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. నేరాల్లో తప్ప పాలనలో జగన్‌కు అనుభవం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ నేతలు జోక్యం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. నేరుగా ఏపీలో తనకు ఓట్లు రావనే కేసీఆర్ జగన్నాటకం ఆడుతున్నారని, జగన్ పార్టీ ద్వారా ఏపీపై పెత్తనం చేయాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కు ఓటేసి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతామా అని ఆయన అడదిగారు. 

సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో తమను బిజెపి భయపెట్టే కుతంత్రాలు పన్నుతోందని మండిపడ్డారు. కుట్రలూ కుతంత్రాలు చేసే బిజెపి, టీఆర్ఎస్, వైసిపిలకు బుద్ధిచెప్పాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

ఐటి దాడులకు భయపడబోమని చంద్రబాబు మంత్రి నారాయణ ఇంటిపై ఐటి దాడులను ప్రస్తావిస్తూ అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతాయని ప్రచారం సాగుతోందని చెప్పారు.