వైసీపీ అడ్డాలో ప్రచారానికి వెళ్లిన టీడీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ప్రచారానికి వెళ్లిన ప్రాంతంలో.. అన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉండటం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. త్వరలో జరగనున్న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో.. టికెట్లు దక్కిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇదేవిధంగా కర్నూలు జిల్లా ఖగ్గల్ లో టీడీపీ మంత్రాలయం అభ్యర్థి తిక్కారెడ్డి శని ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఆయన ప్రచారాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు వేట కొడవళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో వివాదం చెలరేగి తిక్కారెడ్డికి గాయాలయ్యాయి. అయితే.. ఆయన తిరిగి మళ్లీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదివారం తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే..  ప్రచారానికి ఆటంకం కలిగించేలా వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్లాన్ వేశారు.

టీడీపీ ప్రచారానికి వెళ్లిన ప్రాంతంలో.. అన్ని ఇళ్లకు తాళాలు వేయించారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లగా.. మరికొంతమంది వాకిళ్లు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ పరిస్థితి ఉన్నా.. తిక్కారెడ్డి వర్గీయులు ప్రచారాన్ని కొనసాగించారు. అదేవిధంగా ఎమ్మెల్యే బలం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి తిక్కారెడ్డిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో.. కొంతమందికి మాత్రం ప్రచారం చేయడానికి అనుమతి ఇచ్చారు. మొత్తాన్ని ప్రచారం మొత్తం రసాభాసగా మారింది.