ఏలూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసీఆర్, నీ ఆటలు సాగవు, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 

కొంతమంది పొద్దునో పార్టీలో సాయంత్రం మరో పార్టీలో ఉంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కండువాలు క్షణాల్లో మార్చేస్తున్నారని అన్నారు. ఇదంతా వైసీపీ కోసం కేసీఆర్‌ ఆడిస్తున్న డ్రామా ఆయన అన్నారు. కొందరు నాయకులు అవకాశవాదంతో పార్టీలు మారినంత మాత్రాన జనం ఆలోచనలు మారుతాయా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఆలోచించడం మారుతుందా అని అడిగారు.
 
జగన్‌ను అడ్డుపెట్టుకుని ఏపీని అతలాకుతలం చేయాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ తెలంగాణలో హిట్లర్‌లా తయారయ్యాడని అన్నారు. ఏపీ మీద కేసీఆర్‌ పెత్తనం చేయాలనుకుంటున్నాడని అన్నారు.  కేసీఆర్‌ దౌర్జన్యాలను ఎదుర్కొనే శక్తి తనకు ఉందని ఆయన చెప్పారు. 

ఇన్ని కేసులు ఉన్న జగన్‌ మనకు అవసరమా ఆయన అడిగారు. ఫామ్‌-7తో 9 లక్షల ఓట్లు తీసేయాలంటూ చెప్పారని, ఓట్లు తీసేయడం జగన్‌కు కేసీఆర్‌ నేర్పించారని అన్నారు. ఓట్లు కొనడమే కాకుండా మాట్లాడిన వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు.